
అర్హతలున్న ప్రతి ఒక్కరూ ఓటర్గా పేరు నమోదు చేసుకోవాలి
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఘనంగా యువ ఓటర్ పండుగ
ఎదులాపురం, సెప్టెంబర్ 30 : ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమైందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో యువ ఓటర్ పండుగ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ పోటీల్లో యువత పాల్గొనడంతో పాటు ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వారి పేర్లను ఓటర్గా నమోదు చేసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలు నిర్వహిస్తూ చైతన్య పరిచేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే రెండు మాసాల్లో జిల్లాలోని యువత సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండి సమస్యల పరిష్కార సాధకులుగా మారాలని కోరుతున్నానన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాస, వకృత్వ, చిత్రలేఖనం, ఆటపాటల పోటీలు నిర్వహిస్తూ యువతను ఉత్తేజ పరుస్తూ, అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రతి ఒక్కరిఈ ఓటర్ జాబితాలో చేర్చి వంద శాతం నమోదుతో ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎన్.నటరాజన్ మాట్లాడుతూ.. వచ్చే మూడు మాసాల్లో ఓటర్ జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, నమోదు వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. స్వచ్ఛమైన ఓటర్ జాబితాలను తయారు చేయడానికి అన్ని అంశాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా వివిధ ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఎస్సీసీ కెడెట్లు, విద్యార్థులతో సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్ఎస్ఎస్ కోఆర్టినేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వలంటీర్ల్ల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువతను ఓటర్గా నమోదు చేయడంలో సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానం మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతంగా ఓటర్గా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు, శ్రీ వేంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటల రూపంలో ఓటర్ నమోదుపై వివరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను కలెక్టర్ అందజేశారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన రెండు సంవత్సరాల సుదీక్షను కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు. మాన్య, ఉత్కర్ష, హిమజ నృత్య ప్రదర్శనలు, దివిజ వీణ వాయిద్యం సభికులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గెజిటెడ్, హై స్కూల్ నం.1 విద్యార్థులు ప్రదర్శించిన డాన్స్లు ప్రేక్షకులను ఆనందింపజేశాయి. కార్యక్రమంలో ఆర్డీవో జాడి రాజేశ్వర్, తహసీల్దార్ భోజన్న, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియా, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, సాంకేతిక సహాయకుడు కే ఉమాకాంత్, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.