
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ
6 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అవకాశం
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 20 : విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, విజ్ఞాన ప్రతిభను వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విజ్ఞాన భారతి విజ్ఞాన్ ప్రసార్ ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్) ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రత్యేక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నది. తాజాగా 2021-22 సంవత్సరానికి ఆన్లైన్ విధానంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న పోటీ పరీక్షల నిర్వహణకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఏటా ఈ పోటీలను జాతీయ స్థాయి శాస్త్రవేత్త పేరుతో నిర్వహిస్తున్నది. ఈ పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 6 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివే విద్యార్థులందరూ అర్హులే. రూ.100 చెల్లించి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ వెబ్సైట్లో httpvvm.org.in లో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారికి త్వరలో మోడల్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం నవంబర్ 30, డిసెంబర్5వ తేదీన విద్యార్థులు తమకు అనుకూలమైన రోజును ఎంపిక చేసుకుంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష సమయం నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు భాషలో హాజరయ్యే అవకాశం ఉంది. ముందుగా పాఠశాల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయి, జాతీ య స్థాయిలో పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయికి సంబంధించి త్వరలోనే తేదీలను ప్రకటించనున్నారు.
విద్యార్థులకు ప్రయోజనం
ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల్లోని దాదాపు 25 వేల మందికి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 51,754 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.మొత్తం 76,754 వేల మంది విద్యార్థులు ప్రయోజనం చేకూరనుంది.
పరీక్ష విధానం
జూనియర్ విభాగం పరిధిలో 6,7,8, తరగతుల విద్యార్థులు, సీనియర్ల కేటగిరీలో 9,10,11 (ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు) రానున్నారు. 100 మార్కుల మల్టీపుల్ చాయిస్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. నెగెటివ్ మార్కులు లేవు. విద్యార్థులు ఆండ్రాయిడ్ మొబై ల్, ట్యాబ్, ట్యాప్టాప్, డెస్క్ టాప్, డిజిటల్ పరికరాల్లో ఏదైనా ఒకదాని ద్వారా నిర్ధేశించిన అప్లికేషన్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంటి వద్దనుంచే పరీక్షకు హాజరుకావచ్చు
ప్రశంసా పత్రాలు.. నగదు ప్రోత్సాహకాలు
సామాన్య, గణితం పాఠ్యపుస్తకాలల్లోని అంశా లు 50 శాతం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో భారత దేశ కృషి పై 20 శాతం, శాస్త్రవేత్త జీవిత చరిత్ర 20 శాతం, లాజిక్ రీజరింగ్ 10 శాతం ప్రశ్నలతో పరీ క్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పుస్తకాలు ఇదే వెబ్సైట్లో లభ్యమవుతాయి. బహుళైచ్చిక ప్రశ్నలతో ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికను అందించనున్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.5 వేలు, 3 వేలు 2 వేలను బహుమతిగా అందించనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రూ.25 వేలు రూ.15వేలు, 10 వేల చొప్పున అందించనున్నారు. దేశంలోని పరిశోధన,అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
సైన్స్పట్ల ఆసక్తి ఉండి భవిష్యత్‌లో పరిశోధనల వైపు అడుగువేసే విద్యార్థులకు ఈ పరీక్ష ఒక వరం లాంటిది. కంప్యూటర్, సెల్‌ఫోన్ వినియోగం తెలిసిన విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియయోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవచ్చు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి. వెబ్సైట్లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించి విద్యార్థులను పోటీపరీక్షలకు హాజరయ్యేలా చూడాలి.
నాగుల రవి, నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్