దండేపల్లి, సెప్టెంబర్ 1: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. మండలంలోని కొర్విచెల్మ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు విద్యార్థులు ఎంత మంది హాజరయ్యారని ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థులకు భౌతికదూరం పాటించేలా కూర్చోబెడుతూ విద్యాబోధన అందించాలన్నారు. మాస్కు ధరించి, శానిటైజ్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట హెచ్ఎం రాజిరెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్, సెప్టెంబర్ 1 : మండలంలోని ముల్కల్ల, దొనబండ ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసతులు, పారిశుధ్య పనులు, కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, మధ్యాహ్న భోజనం అమలు తీరుపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట హాజీపూర్ ఎంపీడీవో అబ్దుల్ హైతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబరు 1 : పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు, ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ భారతీ హోళీకేరి ఆదేశించారు. మండలంలోని తిమ్మాపూర్, వెంకట్రావుపేట పాఠశాలలు, పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ప్రతి రోజూ శానిటైజేషన్ చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలని, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో అజ్మత్ అలీ, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, వెంట మండల విద్యాధికారి కాసుల రవీందర్, ఏపీవో వెంకటరమణ, అంకతి గంగాధర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.