
ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
రాథోడ్ పాండురంగ్ కుటుంబానికి రూ.4 లక్షల చెక్కు అందజేత
ఎదులాపురం, సెప్టెంబర్ 1 : కరోనా వంటి క్లిష్ట సమయంలో పోలీసులు ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారని, వారి కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. క్యాంప్ కార్యాలయానికి బుధవారం బాధిత కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల క్షేమం కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూ రంగా ఉండి విధులు నిర్వహించారని పేర్కొన్నా రు. ఇందులో భాగంగా గుడిహత్నూర్ మండలం కొల్లారి గ్రామానికి చెందిన రాథోడ్ పాండురంగ్ (27) మవాల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ గతేడాది అక్టోబర్ 14న కొవిడ్‌తో హైదరాబాద్‌లోని దవాఖానలో మృతిచెందాడని తెలిపారు. ఆయనకు భార్య ప్రియాంక, కొడుకు ఉన్నారని పేర్కొన్నారు. ప్రియాంకకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా నివేదికలు పంపినట్లు వెల్లడించారు. అనంతరం హైదరాబాద్ భద్రతా విభాగం నుంచి మంజూరైన రూ.4 లక్షల విలువ గల చెక్కును వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ సీఐ ఓ సుధాకర్‌రావు, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సెక్షన్ నిర్వహణాధికారి ఎస్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన ఇచ్చోడ సీఐ..
ఇచ్చోడ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌బాబు, క్యాంప్ కార్యాలయంలో ఇన్చార్జి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించారు. ఆయనను కలిసిన వారిలో బదిలీపై వెళ్తున్న సీఐ కంప రవీందర్, క్యాంప్ కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్ ఉన్నారు.
ఉద్యోగోన్నతి పొందిన భద్రాద్రికి అభినందన..
ఆదిలాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగంలో సీనియర్ సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్న గోంగూర భద్రాద్రి ఉద్యోగోన్నతి పొందగా, ఆయనను ఇన్చార్జి ఎస్పీ అభినందించారు. క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-2గా ఉద్యోగోన్నతి కల్పించి, వరంగల్ సబ్ కోర్డుకు బదిలీ చేసింది. కార్యక్రమంలో స్పె షల్ బ్రాంచ్ సీఐ గుమ్మడి మల్లేశ్, ఎస్ఐ సయ్యద్ అన్వర్ ఉల్ హక్, క్యాంప్ కార్యనిర్వాహణాధికారి దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్..
శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఇన్చార్జీ ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉన్నందున డీఎస్పీ లేదా ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రజలు గుమిగూడేలా ఉండే కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారని హెచ్చరించారు.