
గ్రామాలు, మున్సిపాలిటీల్లో పది రోజుల పాటు కార్యక్రమాలు
చేపట్టబోయే పనులపై ప్రజాప్రతినిధులు,అధికారులకు అవగాహన
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.01 కోట్ల మొక్కల పెంపకం
పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమైన అధికారులు
ఇప్పటికే అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలు, పట్టణాలు
ఆదిలాబాద్, జూన్ 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల నిర్వహణకు వేళయ్యింది. నేటి నుంచి పది రోజులపాటు పల్లెలు, పట్టణాల్లో చేపట్టనుండగా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మురుగు కాలువలు శుభ్రం చేయడం, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించడం, విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించడం, రోడ్లు బాగు చేయడం, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం వంటివి నిర్వహించనున్నది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.01 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఈ అంశాలన్నింటిపై ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. –
“ప్రతి గ్రామం ప్రగతిబాటన పయనించాలి. పచ్చదనంతో పల్లెలు వెల్లివిరియాలి. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి. గ్రామీణ ప్రజలందరూ తమ ఇండ్ల ముందు, ఇంటి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా చైతన్యపరచాలి. ఇందుకోసం అన్ని పల్లెల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున డోర్ టు డోర్ పంపిణీ చేసి నాటించాలి.
గ్రామాలు, పట్టణాలు సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నేటి నుంచి 10 రోజుల పాటు..
నేటి నుంచి పది రోజుల పాటు మరో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు భాగస్వాములవుతారు. మండలానికి, వార్డుకు ప్రత్యేకాధికారులను నియమించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహిస్తారు.
పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా..
గురువారం నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు పనులు చేపట్టనున్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మురుగు కాల్వలను శుభ్రం చేయడం, తాగునీటి పైపులైన్లు, నల్లాల లీకేజీలు లేకుండా మరమ్మతులు చేస్తారు. పట్టణాల్లోని డ్రైనేజీలను శుభ్రపర్చి వరద నిల్వకుండా చర్యలు తీసుకుంటారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, దవాఖానలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడడంతో పాటు వాననీరు నిల్వకుండా చర్యలు చేపట్టనున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడంతో పాటు బావుల్లో క్లోరినేషన్ చేస్తారు. పది రోజుల పాటు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి వాటిని సంరక్షించేలా చర్యలు చేపడుతారు. ఆపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేస్తారు.
పల్లె ప్రగతి ఫలితాలు..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. గ్రామాలు శుభ్రంగా మారడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు దూరమయ్యారు. గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను పంపిణీ చేశారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 10 శాతం నిధులు పచ్చదనానికి వినియోగిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డులు, వైకుంఠధామాలను ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి ఇంటింటా ఆరు మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. పాడుబడ్డ ఇండ్లు, బంగ్లాలు, బావులను కూల్చివేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్కారు తుమ్మలు, పెంట కుప్పలు, పనికిరాని వాటిని తొలగించి గ్రామాలు శుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు. వంగిపోయి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసి ఎల్ఈడీ బల్బులు అమర్చారు. వేలాడుతున్న కరెంట్ తీగలను సరిచేశారు. గ్రామాల్లోని ఖాళీ స్థలాలతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి పల్లెలో తడి, పొడి చెత్తను సేకరించడానికి ట్రై సైకిళ్లు అందించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీ కోసం సిగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. గ్రామాల్లో లొందలు, ఎత్తుపల్లాలుగా ఉన్న రోడ్లను సరిచేశారు. దీంతో గ్రామస్తులకు రవాణా సౌకర్యం మెరుగైంది.
ఉమ్మడి జిల్లాలో 2.01 కోట్ల మొక్కల లక్ష్యం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ఏడో విడుత కార్యక్రమంతో మరింత హరితశోభ రానుంది. గు రువారం నుంచి ఏడో విడుత ప్రారంభం కానుండగా.. మొ క్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈ విడుతలో 1.08 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. నిర్మల్ జిల్లాలో 65 లక్షలు లక్ష్యంకాగా.. ఆదిలాబాద్ జిల్లాలో 43.64 లక్షల మొక్కలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 52.68 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 40.28 లక్షల మొక్కలు నాటనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖ, మున్సిపల్, ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టి నాటేందుకు సిద్ధంగా ఉంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,509 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మొక్కలను సిద్ధం చేశారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో కౌన్సిలర్లు మొక్కల సంరక్షణ బాధ్యతలు చూస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.