
బ్యారేజీ నిర్మాణానికి రూ. 554 కోట్లు
జూన్ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు
18వేల ఎకరాలకు అందనున్న సాగు నీరు
నిర్మల్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో దాదాపు 18వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, ఆయకట్టు రైతాంగానికి సాగు నీటిని అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అధికార యంత్రాంగం మాత్రం జూన్ నాటికే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వం మొద టి నుంటి సాగు నీటి రంగానికి ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. ఇందు కోసం రూ. 554కోట్లు మం జూ రు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 1176 ఎకరాల భూమి అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1035 ఎకరాలను సేకరించింది. జిల్లా మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి నిర్వాసితులకు అండగా నిలిచారు. పరిహారం పంపిణీ కోసం ముఖ్యమంత్రితో పలుమార్లు చర్చించి ఫలితాన్ని సాధించారు. భూ ములు కోల్పోయిన రైతులందరికీ ప్రభుత్వం 104. 92 కోట్లు పరిహారం అందించింది. మరో 141 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందులో 81 ఎకరాలు నిర్మల్ జిల్లాకు సంబంధించినవి కాగా, 60 ఎకరాల భూములు జగిత్యాల జిల్లాకు సంబంధించినవి ఉన్నాయి. ఈ భూములకు పరిహారం కోసం రూ. 11కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.58 టీఎంసీలుగా నిర్ధారించారు. వచ్చే వానకాలం నాటికి ఆయకట్టుకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం అంతా బ్యారేజీ పనుల పూర్తి పైనే దృష్టి కేంద్రీకరించింది.
నెరవేరనున్న కల…
సదర్మాట్ బ్యారేజీ నిర్మాణంతో నిర్మల్ జిల్లాలోని మామడ, లక్ష్మణచాంద, కడెం, ఖానాపూర్ తదితర మండలాల రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలోని దాదాపు 18వేల ఎకరాలకు రెండు పంటలకూ సాగు నీరందనుంది. సదర్మాట్ బ్యారేజీ పనులు 90శాతం పూర్తయ్యాయని నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామారావు తెలిపారు. మొత్తం 55 గేట్లు బిగింపు మాత్రమే ఉందన్నారు. జూన్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసి వానకాలం సీజన్ వరకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.