జిల్లాలో ‘మన ఊరు-మనబడి’కి 260 పాఠశాలల ఎంపిక
అత్యధికంగా ముథోల్ నియోజకవర్గంలో..
దిలావర్పూర్ ఫిబ్రవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించింది. దీంతో సర్కారు బడులకు మహర్దశ వచ్చింది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో నిర్మల్ జిల్లాలో మొత్తం 260 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో 52 పాఠశాలలను ఎంపిక చేయగా, నిర్మల్ నియోజకవర్గంలో 94, ముథోల్ నియోజకవర్గంలో 114 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలలను ప్రభుత్వం మూడు నెలల కాలంలో మరమ్మతులతో పాటు వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనుంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి సైతం ఓ ప్రకటన చేశారు.
దిలావర్పూర్ మండలంలో ఎంపికైన పాఠశాలలివే..
నిర్మల్ నియోజకవర్గంలో దిలావర్పూర్ మండలంలో ఎనిమిది పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా కాల్వ ప్రాథమిక పాఠశాల, కాల్వతండా పాఠశాల, న్యూ లోలం పాఠశాల, గుండంపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలు, దిలావర్పూర్లోని ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలు, బన్సపల్లిలోని ప్రాథమిక పాఠశాల ఎంపికయ్యాయి. ఈ పాఠశాలను మూడు నెలల కాలంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా అధికారులు సిద్ధ్దమవుతున్నారు. తమ గ్రామాల్లో పాఠశాలలను ఎంపిక చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తొలుగుతాయని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు.