
ఎదులాపురం, ఆగస్టు 3 1: బడుగు, బలహీన వరాల సమాజ శక్తి అన్నాబావు సాటే అని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం అన్నాబావు సాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అన్నాబావుసాటే, లావుజీసాల్వే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. మహనీయుల జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన అనుసరించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో 8 గుంటల భూమిని ఇప్పించి ఆ స్థలంలో కమ్యూనిటీహాల్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న నుంచి ప్రత్యేక నిధుల్లో రూ.25 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా కావాల్సిన సౌకర్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. స్వర్గీయ డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే చేసిన సేవలు మరువలేనివన్నారు జిల్లాలోనే కాకుండా మహారాష్ట్రలో సైతం మాతంగ్, మంగ్ తదితర సంఘాల అభివృద్ధికి కృషిచేశారని తెలిపారు.
సభ సభ్యుల విన్నపం మేరకు డీసీసీబీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించాలని, స్వర్గీయ నాందేవ్ కాంబ్లే తనయుడికి ఇవ్వాలన్న కోరికను ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. అనంతరం ముఖ్యఅతిథులకు జ్ఞాపికలు అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మాజీ ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, టీఆర్ఎస్ నాయకుడు మర్సకోల తిరుపతి, అన్నాబావు సాటే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఉద్దవ్ కాంబ్లే, ఉపాధ్యక్షుడు భట్లాడే సూర్యకాంత్, కార్యదర్శి డీకే నాందేవ్ , గౌరవ సలహాదారులు గణేశ్ మెకానే, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బాలజీ కాంబ్లే, సామాజిక కార్యకర్త బండారి దేవన్న , మధుకర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.