ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
దివ్యాంగుల సమస్యలపై సమావేశం
ఎదులాపురం, ఫిబ్రవరి 19 : దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా పలువురు దివ్యాంగులు పలు విషయాలపై విన్నవించారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం పలు సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన దివ్యాంగులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపులో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామసభలు నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన వారికి స్త్రీనిధి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మెప్మా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో రోస్టర్ పాయింట్ ప్రకారం ఎంపిక చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీ, పింఛన్ల మంజూరు, జాతీయ ఉపాధి హామీ పథకం, అంత్యోదయ కార్డులు తదితర సమస్యలపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఈవో ప్రణీత, ఆర్డీవో రాజేశ్వర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ శైలజ, వివిధ శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.