నిర్మల్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : గోదావరిపై నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని రైతాంగానికి సాగు నీరందించాలన్న లక్ష్యంతో మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద నిర్మించిన సదర్మాట్ ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 18 వేల ఎకరాలకు సాగునీరందించాలని తలపెట్టింది. జగిత్యాల జిల్లాకు ఐదు వేలు, నిర్మల్ జిల్లాకు 13 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదాశయంతో భూ సేకరణ కోసం రైతులు కోరుకున్న విధంగా పరిహారాన్ని చెల్లించడమే కాకుండా ఆ నిధులను వారికి అందజేసింది.
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ప్రాజెక్టు పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొంతమేర సివిల్ పనులతోపాటు ముఖ్యమైన విద్యుదీకరణ పనులు మొదలు కాలేదు. కేసీఆర్ ప్రభుత్వం విద్యుదీకరణ పనుల కోసం రూ.15 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించడమే కాకుండా అవసరమైన మేరకు నిధులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఇంతలోనే ఎన్నికలు రావడం, ప్రభు త్వం మారడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. అయితే టెండర్ ప్రక్రియను మాత్రం చేపట్టింది.
కాగా.. పనుల కు సంబంధించిన ధరలలో వ్యత్యాసాలు ఉన్న కారణంగా ఆ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీని కారణంగా మూడు సార్లు టెండర్ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగో సారి ఒక ఏజెన్సీ పనుల కోసం టెండర్ దక్కించుకున్నది. అయితే సదరు కాంట్రాక్టు పొందిన కంపెనీ కూడా పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంపై కొన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.520 కోట్లు వ్యయం చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం చివరి దశ పనులకు మరో రూ.50 కోట్లను కూడా ఖర్చు చేయకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
సదర్మాట్ కింద నిర్మల్, జగిత్యాల జిల్లాలోని 18 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేర్తయి ఉంటే కనీసం వచ్చే యాసంగి సీజన్‌కైనా సాగు నీరందేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1176 ఎకరాలను సేకరించాలని నిర్ణయించగా, ఇందులో 55 ఎకరాల భూ సేకరణ పెండింగ్‌లో ఉన్నది. సేకరించిన భూములకు సంబంధించి దాదాపు రూ.116 కోట్ల పరిహారాన్ని రైతులకు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారాన్ని గణనీయంగా పెంచిన కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 లక్షల చొప్పున అందజేసింది. గతంలో ఎకరానికి కేవలం రూ.3-4 లక్షలు మాత్రమే చెల్లించగా, కేసీఆర్ ప్రభుత్వం రైతుల డిమాండును పరిగణలోకి తీసుకుని వారిని ఆదుకోవాలన్న సదాశయంతో ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించింది.
ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన పనుల అంచనాలను రూపొందించిన అధికారులు గతంలోనే ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలపై కనీస స్థాయి పరిశీలన చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రాజెక్టు వద్ద బీటీ రోడ్ల నిర్మాణం, గోదావరి నదిలోని నీటిని ప్రాజెక్టు వద్దకు మళ్లించేందుకు అవసరమైన గైడ్ వాల్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. వీటితో పాటు మరికొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా పనులన్నింటి కోసం మరో రూ.40 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆయా పనుల కోసం ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ఆమోదం పొందితేనే ప్రాజెక్టు పనులు వంద శాతం పూర్తయి, వచ్చే యాసంగి పంటలకు సాగునీరందే అవకాశం ఉంది.