
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ఆదిలాబాద్ డీఈవో టామ్నె ప్రణీత అన్నారు. మండలంలోని అంకోలి, తంతోలిలోని జడ్పీ పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల్లో సామర్థ్యాలు తగ్గాయని, వారిని అభివృద్ధి చేయడానికి 3 ఆర్స్(రైటింగ్,రీడింగ్,అర్థమెటిక్)ను అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో అంకోలి హెచ్ఎం నరేందర్ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.
విద్యార్థులను అభినందించిన డీఈవో
జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఎంపికైన విద్యార్థులను డీఈవో ప్రణీత అభినందించారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ కల్యాణ్, విజయ్ను సన్మానించారు. డ్రాపౌట్ విద్యార్థులు ఇలాంటి పాఠశాలల్లో ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. ప్రిన్సిపాల్ ప్రశాంత్‌రెడ్డి, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి ఉదయశ్రీ, ఏఎస్వో మహేందర్ రెడ్డి ఉన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్మల్ డీఈవో రవీందర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. వంట గది, మూత్రశాలలు, తరగతి గదులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు పట్టికతో పాటు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వెంట హెచ్ఎం అల్లం రవిబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.
మార్పు కన్పించాలి
ప్రభుత్వ పాఠశాలలో మార్పు కన్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీని తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలు, వంట గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకోవాలని, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీయాలని సూచించారు.10 తరగతి విద్యార్థులకు 10 జీపీఏ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఆయన వెంట హెచ్ఎం ఈశ్వర్, ఉపాధ్యాయులు ఉన్నారు.