పక్క నుంచి వేగంగా వచ్చి ఢీకొన్న లారీ
అక్కడికక్కడే ఉపాధ్యాయురాలి మృతి
జైనథ్/ తాంసి, ఫిబ్రవరి 18 : ఎప్పటిలాగే పాఠశాల విధులకు హాజరయ్యేందుకు ఆమె స్కూటీపై వెళ్తున్నది. ఈ క్రమంలో భోరజ్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఆమెను ఆపి తనిఖీ చేస్తుండగా.. పక్క నుంచి వేగంగా వచ్చిన లారీ సదరు ఉపాధ్యాయురాలి ముఖాన్ని ఢీకొంటూ వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన భోరజ్ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం జరిగింది. జైనథ్ ఎస్ఐ పెర్సిస్ తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఏనుగు పద్మ(55) ఉపాధ్యాయురాలు. ఈమె విధినిర్వహణలో భాగంగా స్కూటీపై ఆదిలాబాద్ నుంచి బేల మండలం హేటి గ్రామానికి వెళ్తారు. ఈక్రమంలో శుక్రవారం సైతం అలాగే బయల్దేరారు. భోరజ్ చెక్ పోస్ట్వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఆమె స్కూటీని పక్కన నిలిపారు. ఈ సమయంలో పక్క నుంచి వేగంగా వస్తున్న లారీ.. పద్మ ముఖాన్ని ఢీకొంటూ దూసుకెళ్లింది. తీవ్రగాయాలై ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కాగా.. భోరజ్ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పద్మ ప్రాణాలు బలయ్యాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయురాలి మృతి దురదృష్టకరం..
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందడం దురదృష్టకరమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఉపాధ్యాయురాలు ఏనుగు పద్మ మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
పొన్నారి పాఠశాలలో నివాళి..
తాంసి మండలం పొన్నారిలో పద్మ ఎనిమిదేండ్లు పనిచేసి ఇటీవలే బదిలీపై బేల మండలానికి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో పద్మ మృతిచెందారన్న వార్త తెలుసుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రార్థన సమయంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.
చెక్‌పోస్టుపై స్థానికుల దాడి..
ప్రమాదం జరిగిన చెక్‌పోస్టుపై స్థానికులు దాడి చేశారు. ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన మూడు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్ని పార్టీల నా యకులు డిమాండ్ చేశారు. అఖిలపక్షం నాయకులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పాయల్‌శంకర్, సుహాసినిరెడ్డి, గండ్రత్ సుజాత, జైనథ్ ఎం పీపీ గోవర్ధన్, జడ్పీటీసీ అరుంధతి, వెంకట్‌రెడ్డి, లింగారెడ్డి, మహేందర్, భోరజ్, పూసాయి, మండగాడ, కామా యి, పెండల్వాడ, తరో డ, హసీంపూర్, నిరాల, గూడ, రాంపూర్ ప్రజలు పాల్గొన్నారు.