సిరికొండ/బేల,ఆగస్టు 31 : అసలే వర్షాకాలం.. ఇంటా.. బయటా నిత్యం విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. గాలి వానకు స్తంభాలు పడిపోయి.. విద్యుత్ తీగలు తెగిపడి.. ఇలా ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చని ట్రాన్స్‌కో ఏఈ చంద్రశేఖర్ సూచిస్తున్నారు.
నీరు విద్యుత్‌ను పుట్టిస్తుంది. అదే నీరు శత్రువుగా మారి ప్రాణాలు తీస్తుంది. వానాకాలం అంటే అంతటా తడి ఉంటుంది. చిత్తడి తీగలు, స్విచ్‌లు, విద్యుత్ మోటార్లు ఇతరత్రా.. ఉపకరణాలు వాడే వారు పారాహుషార్. విద్యుత్ పరికరాలను శ్రద్ధగా వినియోగించండి. విద్యుదాఘాతం, షార్ట్సర్యూట్ను నివారించండి. మన్నికైన ఎలక్ట్రికల్ వస్తువులను వాడితే వానాకాలంలో సంభవించే పలు ప్రమాదాలను నివారించవచ్చు.
ఇండ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విద్యుత్ లేకుండా క్షణం గడువదు. వెలుగులు నింపే బల్బులు, వినోదం పంచే టీవీలు, వంటింట్లో మిక్సర్ గ్రైండర్లు, రెఫ్రిజిరేటర్లు ఇలా ఒకటేమిటి.. అన్నింటికీ కరంట్ కావాలి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సైతం అది లేకుంటే స్తంభించిపోతాయి. మనం నిత్యం విద్యుత్‌పై ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి వద్ద బట్టలు ఆరేసేటప్పడు విద్యుత్ వైరుకు దగ్గర లేకుండా చూసుకోవాలి. ప్రతి ఇంటికీ ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి. చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్ సరఫరా పరికాలు, స్విచ్‌లను తాకరాదు. పాడైన ఫ్లగ్‌లు, బల్బులు, హోల్టర్లను వినియోగించవద్దు. మహిళలు వాషింగ్ మిషన్ గ్రైండర్, మిక్సీలు వాడు సమయంలో నీటి తడిలేకుండా జాగ్రత్తలు పాటించాలి. కర్రలతో విద్యుత్ తీగలు అమర్చిన చోటికి వెళ్లవద్దు. విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ తీగలు కిందకు వాలిన సమయాల్లో సిబ్బందికి సమాచారం ఇచ్చి సరిచేసుకోవాలి.
అన్నదాతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలా మంది రైతులు కరంట్ సమస్యలు వస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏమవుతుందిలే అన్న ధోరణిలో సొంతంగా మరమ్మతులు చేస్తుంటారు. అది సరికాదు. మోటారు సామర్థ్యానికి సరిపడా నాణ్యత గల తీగలను వాడాలి. వ్యవసాయ పంపు సెట్లకు తప్పనిసరిగా ఎర్తింగ్ చేయాలి. పంపు సెట్‌కు సంబంధించిన తీగలను నేలమీద ఉంచరాదు. తడి దుస్తులతో పంపు సెట్‌ను ఆన్ చేయరాదు. సంబంధిత మోకానిక్ లేదా విద్యుత్ అధికారులను వెంటనే సంప్రదించాలి. పంప్ సెట్‌కు సరైన ఫ్యూజులను అమర్చాలి. పాడైన కటౌట్లను వెంటను మార్చాలి. లేదా కొత్తగా వేయించాలి. కరెంట్ స్టార్టర్లకు కచ్చితంగా తలుపులు అమర్చుకోవాలి. మోటర్లపై మందపాటి ప్లాస్టిక్ కవర్‌ను కప్పి ఉంచాలి. లేదంటే వర్షానికి తడిసి ఒక ఫేస్ తీగ కాలితే మోటర్ మొత్తానికి విద్యుత్ సరఫరా అవుతుంది. దానిని తాకగానే షాక్ కొడుతుంది.
ఆన్‌లో ఉంటే షార్ట్ సర్యూటే..
వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు రావడం సహజం. ఇలాంటి సమయంలో టీవీలు, కంప్యూటర్లు ఆఫ్ చేయడం మంచిది. పిడుగులు పడినప్పుడు టీవీలు కంప్యూటర్లు ఆన్‌లో ఉంటే షార్ట్ సర్యూట్‌తో కాలిపోయే ప్రమాదముంది.
అవగాహన సదస్సులు
తెలంగాణ ప్రభుత్వం వానకాలంలో జరిగే విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరిస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే కొత్తగా స్తంభాలు, విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు.
సెల్‌ఫోన్ మూగబోతుంది
మనిషి జీవితంలో సెల్‌ఫోన్ ఒక భాగమైంది. వానకాలంలో సెల్ఫోన్ల వాడకంపై మెళకువలు, జాగ్రత్తలు పాటించాలి. ఫోన్లు తడవకుండా కవర్లు వాడడం మంచిది. మార్కెట్లో రూ.10 నుంచి 250 వరుకు ప్రత్యేక కవర్లు అందుబాటులో ఉన్నాయి. అనుకోకుండా ఫోన్ తడిస్తే వెంటనే బ్యాటరీ తొలగించి ఆరబెట్టాలి. తడిసిన ఫోన్‌ను ఉపయోగిస్తే డిస్ప్లే చెడిపోతుంది. తడిసిన సమయంలో బ్యాటరీ చార్జింగ్ పెట్టకూడదు. వర్షం కురుస్తుంటే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. సెల్‌ఫోన్ టీవీ దగ్గర పెట్టకూడదు. కొన్ని సందర్భాల్లో అది పేలిపోయే ప్రమాదముంది. మాట్లాడే సమయంలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టవద్దు.
కరెంట్‌తో జాగ్రత్తగా ఉండాలి
వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఏదైన సమస్య ఉంటే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. సొంతంగా మరమ్మతులు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పొలాల్లోని కరంట్ మోటార్లు, ఇండ్లలో నాణ్యమైన తీగలు, స్విచ్‌లను వాడాలి. కరంట్ ప్రమాదాలు నివారణకు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పల్లెలు. పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.