లాభాల సంస్థను బడా కంపెనీలకు కట్టబెట్టే కుట్ర
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై సర్వత్రా విమర్శల వెల్లువ
మండిపడుతున్న పాలసీదారులు,ఉద్యోగులు, ఏజెంట్లు
వచ్చే నెల 28,29వ తేదీల్లో దేశవ్యాప్త ఆందోళనలు..
నిర్మల్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ);లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ).. దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ. ఐదున్నర దశాబ్దాల చరిత్ర. నిరుపేదలందరి నమ్మకం. సామాన్యుడి నుంచి మొదలు కొని సంపన్నుడి దాకా అందరి జీవితాల్లోనూ చెరగని ముద్ర. మనిషి బతికున్నప్పుడే కాదు, లోకం విడిచివెళ్లిన తర్వాతా కుటుంబాలకు అండగా నిలిచి, ప్రతి గడపకూ, ప్రతి గుండెకూ చేరిన మహోన్నత సంస్థ. ఇప్పటి వరకు రూ.లక్షల కోట్ల లాభాలను ఆర్జించడంతో పాటు, దేశంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రానికి నిధులను సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇలాంటి సంస్థపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నది. దేశ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తూ, పాలసీదారుల సంక్షేమానికి నమ్మకంగా సేవలందించిన ఎల్ఐసీని ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేయగా, ఈ పరిణామాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. మోదీ తీరును నిరసిస్తూ వచ్చే నెల 28, 29వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు.
భారతదేశంలో 1818 సంవత్సరంలోనే జీవిత బీమా సేవలు ఆరంభమయ్యాయి. దీనికి కోల్‌కతాలో బీజాలు పడ్డాయి. సురేంద్రనాథ్ ఠాగూర్ హిందూస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీని స్థాపిం చగా.. క్రమంగా ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) సంస్థగా అవతరించింది. 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం తదుపరి బీమా సంస్థల సంఖ్య పెరగడం ఆరంభమైంది. 1900 సంవత్సరం తదుపరి ఇన్సూరెన్స్ కంపెనీలు దేశంలోని ప్రధాన పట్టణాల్లో పనిచేయడం మొదలు పెట్టాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి వందల సంఖ్యలో ప్రైవేట్ బీమా సంస్థలు మనుగ డలో ఉన్నాయి. అనంతరం వీటిని క్రమబద్ధీకరించడం లేదా జాతీయం చేసే చర్యలు ఆరంభమ య్యాయి. ప్రైవేట్ కంపెనీల ఆధీనంలో ఉన్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇండియా, యూనైటెడ్ ఇండియా, ఇండియన్ మర్కైంటైల్, జనరల్ అస్యురెన్స్, స్వదేశీ లైఫ్, సహ్యాద్రి ఇన్సూరెన్స్ ఇలా అనేక సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాయి. అనంతర కాలంలో మోసాలకు పాల్పడడంతో లోక్‌సభ సాక్షిగా అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఫిరోజ్ గాంధీ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు వివరించారు. తర్వాత బీమా సంస్థలను ప్రైవేట్ రంగంలో కొనసాగించడం కంటే, జాతీయం చేయాలని, ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఫిరోజ్‌గాంధీ పార్లమెంట్లో ప్రతిపాదించారు. –
ఎల్ఐసీ అంకురార్పణ ఇలా..
స్వతంత్ర భారత బీమా సంస్థల్లో ఒక నమ్మకమైన, ప్రభుత్వ రంగ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అవతరించింది. 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఆఫ్ 1956ని కేంద్రం జారీ చేయగా, ఈ చట్టం ద్వారా అప్పటికీ మనుగడలో ఉన్న 245 బీమా కంపెనీలతో కలిపి సంస్థ ఏర్పడింది. అప్పుడు కేంద్రం ఎల్ఐసీలో కేవలం 5కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసీ యేటా తన లాభాల్లో 5 శాతం లాభాలను కేంద్రానికి ఇవ్వాలని, 95 శాతం లాభాలను పాలసీదారులకు వినియోగించాలని ఆదేశించింది. కాగా.. ఎల్ఐసీ శాఖోపశాఖలుగా విస్తరించి.. లక్షల బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 40 కోట్ల మందికిపైగా పాలసీదారులు ఉండగా.. 31,14,496 కోట్ల లైఫ్ఫండ్స్, 31,96,214 కోట్ల ఆస్తులను ఎల్ఐసీ సంపాదించుకుంది. 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. విదేశీ పెట్టుబడులతో ప్రైవేట్ బీమా కంపెనీలకు అనుమతిని ఇచ్చింది. 2000 సంవత్సరంలో ప్రైవేట్ బీమా సంస్థలు పెద్ద సంఖ్యలో దేశ మార్కెట్లోకి ప్రవేశించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అందులో చాలా కంపెనీలు మూతపడిపోయాయి.
ప్రైవేటీకరణ ప్రమాదం..
ఎల్ఐసీ ప్రైవేటీకరణతో ప్రమాదపుటంచుల్లోకి వెళ్తున్నది. ప్రైవేట్ కంపెనీలన్నింటినీ జాతీయం చేసి, ప్రభుత్వ రంగం సంస్థగా ఒకప్పుడు మార్చిన బీమా రంగాన్ని మళ్లీ ప్రైవేట్ వ్యవస్థల్లోకి పంపించేందుకు కేంద్రం నిర్ణయించింది. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడులను సమకూర్చుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో వాటాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. సంస్థలో 25 శాతం వాటాను విక్రయిస్తే 2.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఒకేసారి సంపాదించాలని యోచిస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెట్టుబడుల ఉపసంహరణతో ఎల్ఐసీలోకి ప్రైవేట్ కంపెనీలు వచ్చి చేరుతాయి. ఇవి భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వానికి పెట్టుబడులను, లాభాలను అందించేందుకు అంగీకరించని పరిస్థితి నెలకొంటుంది. దీని ప్రభావం కేంద్ర ప్రభుత్వంపైనా, దేశ ప్రజలపైనా చూపుతుంది. కాలక్రమంలో ఎల్ఐసీలో వాటాలను ప్రభుత్వం ఉప సంహరించుకొని, ప్రైవేట్ సంస్థల వాటాలు పెరిగితే పాలసీదారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు పాలసీదారులకు, ప్రభుత్వానికి లభించిన లబ్ధి భవిష్యత్‌లో ప్రైవేట్ కంపెనీల పరం అవుతుంది.
ఎల్ఐసీ ఉద్యోగుల ఆందోళనబాట
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో దాదాపు 160 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా.. దాదాపు 5.20 లక్షలకుపైగా పాలసీదారులు ఉన్నారు. కాగా, ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే తమ బతుకులు ప్రశ్నార్థకమవుతాయని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఏజెంట్లు, పాలసీదారులు మండిపడుతున్నారు. ఇందుకు వ్యతిరేకంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఉద్యోగ సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 28, 29వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు.
ఆది నుంచీ కేంద్రానికి అండ..
ఇప్పటివరకు ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వానికి 24,01,457 లక్షల కోట్ల పెట్టుబడిని అందించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 1956లో పెట్టిన 5 కోట్ల పెట్టుబడికి ఇప్పటివరకు 20వేల కోట్ల డివిడెంట్ను ఎల్ఐసీ చెల్లించింది. ప్రైవేట్ కంపెనీలు బీమా రంగంలోకి ప్రవేశించిన 2000 సంవత్సరం తర్వాత ఈ రెండు దశాబ్దాల కాలంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అదే సమయంలో దాదాపు రూ.10వేల కోట్ల డివిడెంట్ను కేంద్రానికి చెల్లించింది. లక్షన్నర మంది ఉద్యోగులకు నెలనెలా వేలాది రూపాయల వేతనాలు ఇస్తున్న సంస్థ, వారి ఉద్యోగుల వేతనాల ద్వారా నమ్మకమైన, క్రమానుగతమైన ఇన్‌కం ట్యాక్స్‌ను కేంద్రానికి చెల్లించేలా చూసింది. అలాగే పాలసీలపై వ్యాట్, ఇన్కమ్ ట్యాక్స్‌లను పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించింది.
కార్పొరేట్ల డిమాండ్లకు తలొగ్గడం శోచనీయం
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గి జీవిత బీమా సంస్థ వాటాల విక్రయానికి పూనుకోవడం అత్యంత శోచనీయం. 2000 సంవత్సరంలో బీమా రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించారు. నాటి నుంచి ఏ ఒక్క బీమా సంస్థ కూడా ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేదు. ఇప్పటికీ మార్కెట్లో ఎల్ఐసీ 75 శాతం వాటా కలిగి ఉండడం గొప్పతనానికి నిదర్శనం. ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోం. ఉద్యోగులతో కలిసి పోరాటం చేస్తాం.
– టీ తిరుపతి, ఐసీఈయూ అధ్యక్షుడు, నిర్మల్
నమ్మకాన్ని అమ్ముకోవడమే..
కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలోని పెట్టుబడులను అమ్మడం అంటే పాలసీదారుల నమ్మకాన్ని అమ్ముకోవడమే. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఎల్ఐసీ సంస్థ నడిచింది. కేంద్రానికి మంచి పేరు తీసుకొచ్చిన సంస్థను అమ్మేందుకు చూడడం సరికాదు. కేంద్రం ఇప్పటికైనా సంస్థను విడిచిపెట్టి అర్థిక వనరులను సమకూర్చుకునేందుకు కృషి చేయాలి. ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే పాలసీదారులకు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపాల్సిన అవసరం ఏర్పడుతుంది.
– పీవీ చారి, పాలసీదారుడు, ఆసిఫాబాద్.
ఆలోచనను మార్చుకోవాలి..
కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎల్ఐసీ సంస్థలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించడం అంటే ఎల్ఐసీని ప్రైవేట్ చేయడం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణతో ఏజెంట్ల జీవితాలే కాకుండా కోట్లాది మంది కుటుంబాలకు నష్టం వాటిల్లుతుంది.
– బట్టుపల్లి ఆశోక్, ఎల్ఐసీ ఏజెంట్, ఆసిఫాబాద్.