
ఎదులాపురం, సెప్టెంబర్ 23: జిల్లాలో చాలా మంది మహిళలు, విద్యార్థినులు, వివాహితలు, యువతులు ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. పోకిరీల ఆగడాలు పెరిగి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జిల్లా పోలీస్ శాఖ క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే షీటీం అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన క్యూఆర్ కోడ్‌తో ఎలాంటి ఫిర్యాదులైనా కూడా చేయవచ్చు. ఇది దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. క్యూఆర్ కోడ్ ద్వారా మహిళలు, ఆడపిల్లలే కాకుండా వివిధ రంగాల్లో పని చేస్తున్న వారు ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా..! ఏదైనా స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో నుంచి షీటీమ్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే అందులో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఫిర్యాదు చేసి వ్యక్తి వివరాలు, సమాచారం గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదుదారుడు పేరు, వయస్సు, ఫోన్ నంబర్, జిల్లా, ఫిర్యాదు, చేసే వృత్తి, ఈ వివరాలతో పాటు మరిన్ని వివరాలను అందించాలనుకుంటున్నారా! పోలీసులకు అందించిన సమాచారం నిజమని ధ్రువీకరిస్తున్నట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈవ్‌టీజింగ్ , వేధింపులు , ఫోన్, ఆన్లైన్, ఇతర వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు. మహిళలు ,పురుషులు, థర్డ్ జండర్ వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఫిర్యాదు చేసిన 10 నిమిషాల్లో అందులో ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలోని ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామానికి సంబంధించినది ఆ పరిధి షీటీమ్ పోలీసులకు సమాచారం అందజేస్తారు. ఎవరికి తెలియకుండా షీటీమ్ వారు వారి పని చేసుకుంటారు. ఆన్లైన్లో ఫిర్యాదు ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది అని అందులో పరిశీలించుకోవచ్చు. ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కౌన్సెలింగ్, కేసు ఉన్నత అధికారుల పర్యవేక్షణ అనేది ఫిర్యాదుదారుడిపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పటి వరకు 582 ఫిర్యాదులు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 582 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను బట్టి 592 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే 1617 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, ఇందులో 3. 23 లక్షల మంది పాల్గొన్నారు. మహిళలు, యువతులు తిరిగే రద్దీ ఉన్న ప్రాంతాల్లో (హాట్‌స్పాట్)షీటీమ్ బృందాలు 15,120 పర్యాయాలు నిఘా ఉంచాయి. అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి.
మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం..
మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇది వరకే షీటీమ్, 100,181, 1098 టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు క్యూఆర్ కోడ్‌ను తీసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్లు లేని వారు 100, 112 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఇందులో చేసిన ఫిర్యాదుకు కూడా 10 నిమిషాల్లో ప్రధాన కార్యాలయం నుంచి ఫిర్యాదారులకు సమధానం ఇస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు షీటీమ్‌లు పనిచేస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణం, ఆదిలాబాద్ రూరల్, ఉట్నూర్ ప్రాంతాల్లో మొత్తం 8 మంది పనిచేస్తారు. షీటీం సిబ్బందిలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉంటారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదవుతున్న విద్యార్థినికి మొదటగా గుర్తుతెలియని నంబర్ నుంచి మెస్సేజ్, ఆ తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి.. మీరు ఎవరు అని ప్రశ్నించగా.. ఊరికే ఫోన్ చేశానని గుర్తు తెలియని వ్యక్తి సమాధానం ఇచ్చాడు. మరో సారి ఫోన్ చేయవద్దని, నా నంబర్ నీకు ఎవరు ఇచ్చారని అడిగింది. దీనికి ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు. ఆతర్వాత ఆమె ఈ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్ట్టింది. తన ఫోన్ నంబరు నుంచి స్పందన లేదని తెలుసుకున్న వ్యక్తి, ఈమె నంబర్‌ను మరో నలుగురు స్నేహితులకు ఇవ్వగా, వరుసగా వాళ్లు కూడా ఫోన్ చేసి వేధించడం మొదలు చేశారు. దీంతో ఆ విద్యార్థిని వారందరి ఫోన్ నంబర్లు కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అయినా సరే మరో తెలియని నంబరు నుంచి ఫోన్, మెసేజ్‌లు రావడంతో ఓపిక నశించి నేరుగా షీటీమ్‌కు డయల్ చేసింది బాధితురాలు. నిమిషాల్లోనే రంగంలోకి దిగిన షీటీం బృందం వచ్చిన ఫోన్ నంబర్లను తీసుకొని వివరాలను రాబట్టుకొని వారందరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై ఎవరితోనైనా ఫోన్లలో, ప్రత్యక్షంగా అనుచితంగా ప్రవరిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. దీంతో బాధితురాలి సమస్య ఒక్క ఫోన్ కాల్తోనే పరిష్కారమైంది. ఆ తర్వాత బాధితురాలు షీటీంకు కృతజ్ఞతలు తెలియజేసింది.
వెకిలి చేష్టలపై మౌనంగా ఉండొద్దు
యువతులు, మహిళలు తమపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు, ఇతర వెకిలి చేష్టలపై మౌనంగా ఉండొద్దు. వెంటనే షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తే పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు అందగానే 10 నిమిషాల్లోనే సంబంధిత ప్రాంత షీటీం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుటున్నాం. షీటీమ్స్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. బస్సులు, మందిరాల్లో, ఇలా రద్దీ ఉన్న ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అతికించాం. ప్రారంభంమైన పాఠశాలల్లో , కళాశాలల్లో ప్రిన్సిపాల్ కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్లు అందుబాటులో ఉంచాం.
కౌన్సెలింగ్ ఇస్తే మళ్లీ కేసులు రావడం లేదు..
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఒక్కసారి కౌన్సెలింగ్ తీసుకున్న వారిపై ఫిర్యాదులు ఇక మళ్లీ రావడం లేదు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేయకున్నా, షీటీమ్‌కు సమస్య చెప్పినా, అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. 24 గంటల పాటు షీటీం అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేని వారు 100 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. లేదంటే సంబంధిత షీటీం అధికారి ఫోన్ నంబర్‌ను పలు ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో డిస్ప్లే చేస్తున్నాం.