నిర్మల్ అర్బన్/బోథ్/బేల, డిసెంబర్ 21 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా చలి, ఎండ తీవ్రత ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటుంది. ఉన్నట్టుండి వారం రోజులుగా గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత నెలలో 12 నుంచి 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తాజాగా మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నేధరిలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్పంగా 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆదిలాబాద్లో 5.2, మంచిర్యాలలో 5.5, నిర్మల్లో 5.8 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్లోనే చలి ఈ స్థాయిలో ఉంటే.. రానున్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఉదయం 9 గంటలైనా పొగమంచు తొలగిపోవడం లేదు. సాయంత్రం ఆరు గంటలకే రోడ్లపై జన సందడి తగ్గుతున్నది. ఉదయం పూట పనులు చేసుకునేవారి ఇబ్బందులు అన్నిఇన్నికావు. పాలవాళ్లు, కూరగాయలు అమ్ముకునేవారు, పేపర్ బాయ్స్ ఉన్ని దుస్తులతో యలుదేరుతున్నారు. రోడ్ల పక్కన పలువురు చలిమంటలు వేసుకుంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా పొద్దుపొడిచే వరకు ఇంట్లోంచి కదలడం లేదు. చలి తీవ్రతతో టీ స్టాళ్లు ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా చలి తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు శ్వాసకోస సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తులకు డిమాండ్ పెరిగింది. ప్రజలు ఉన్ని దుస్తులను ఎగబడికొంటున్నారు.
చలికాలం జాగ్రత్తలు..