4673 మంది విద్యార్థుల హాజరు
థర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమతి
ఒక్కో సీటుకు ఐదుగురు చొప్పున పోటీ
బెల్లంపల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఆర్సీవో స్వరూపారాణి
ఎదులాపురం, ఫిబ్రవరి 20 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జూనియర్, సీవోఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ఉండ గా, విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు తరలివచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కు శానిటేషన్తో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతించారు. ఈ సందర్భం గా ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో 4, మంచిర్యాలలో 7, ఆసిఫాబాద్లో 4 పరీక్షా కేంద్రాల్లో 5065 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 4673 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 392 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. బాలికలు 2970 మందికి 2758 మంది పరీక్ష రాశారని, బాలురు 2095 మందికి 1915 మంది రాయగా 180 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 92.3 శాతం హాజరు నమోదైందన్నారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా వ్యాప్తంగా 11 గురుకులాలు ఉన్నా యని, ఇందులో బాలికలు 7, బాలుర కళాశాలలు 4 ఉన్నాయన్నారు. ఒక సీటు కోసం ఐదుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. బెల్లంపల్లి పరీక్షా కేంద్రాన్ని ఆర్సీవో, సిర్పూర్ పరీక్షా కేంద్రాన్ని ఏఆర్సీవో పరిశీలించారు.