నిర్వహణ లోపం..తరచూ ప్రమాదాలు
బ్లాక్స్పాట్లు గుర్తించినా ఎన్హెచ్ఏఐ నిర్లక్ష్యం
వరుసగా మూడు రోజుల్లో ముగ్గురి మృతి
తాజాగా విధులకు వెళ్తున్న ఉపాధ్యాయురాలు..
ఆందోళనకు దిగిన స్థానికులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఎన్హెచ్ఏఐ అధికారుల నిర్లక్ష్యం.. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. హైదరాబాద్ – నాగ్‌పూర్ జాతీయ రహదారి నంబర్ 44 నిర్వహణ లోపం కారణంగా ప్రమాదాలకు కేంద్రమవుతున్నది. ఈ రహదారి నిర్మాణ లోపాలను సరిచేయాలని గతంలో పలుసార్లు స్థానికులు కోరినా, ఎన్హెచ్ఏఐ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి,. కాగా, జైనథ్ మండలం భోరజ్ వద్ద మూడు రోజుల్లో జరిగిన వరుస ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందడంతో వివాదం చెలరేగింది. శుక్రవారం కూడా ఓ ఉపాధ్యాయురాలిని ట్రక్కు ఢీకొట్టడం.. స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. అధికారుల నిర్లక్ష్యవైఖరికి నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించడంతో పాటు ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై దాడికి దిగారు. జిల్లా ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించగా, ఇప్పటికైనా ఎన్‌హెచ్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 44 విస్తరించి ఉంది. నేరడిగొండ నుంచి జైనథ్ మండలం మహారాష్ట్ర సరిహద్దు పిప్పర్వాడ వరకు 80 కిలోమీటర్లు మేర ఉన్న ఈ రోడ్డుపై రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఉత్తరాది రాష్ర్టాల నుంచి దక్షిణాది రాష్ర్టాలకు సరుకుల రవాణాతో పాటు ప్రజలు కూడా తమ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు. కాగా, ఈ రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డుకు ఇరువైపులా సర్వీస్రోడ్డులు, స్లీప్ రోడ్డులు, అండర్‌పాస్‌లు లాంటివి అవసరమైన చోట చేపట్టలేదు. ఇదే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు గతంలో పలుమార్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరినా ఫలితం లేదు. దీంతో ఈ రహదారిపై ప్రయాణ ప్రాణసంకటంగా మారింది. జిల్లాలోని జాతీయ రహదారిపై గతంలో జందాపూర్ ఎక్స్‌రోడ్, మావల క్రాసింగ్, భోరజ్ చెక్‌పోస్టు, మావల మూలమలుపు, దేవాపూర్ క్రాసింగ్, గుడిహత్నూర్ బస్టాండ్ ఏరియా, గాంధీనగర్, ఉట్నూర్ క్రాస్‌రోడ్డు, సీతాగొంది ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండేవి. వీటిని అధికారులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. గతంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నేషనల్ హైవే అథారిటీని కోరినా ఫలితం లేకుండా పోయింది.
మూడు రోజుల్లో ముగ్గురు..
జైనథ్ మండలంలోని భోరజ్ వద్ద జాతీయ రహదారిపై వరుసగా మూడ్రోజులుగా జరుగుతున్న ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. శుక్రవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఉపాధ్యాయురాలు పద్మ స్కూటీపై వెళ్తుండగా ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆగ్రహించిన స్థానికులు ఆర్టీఏ చెక్‌పోస్టుపై దాడి చేసి ధ్వంసం చేశారు. బుధవారం బైక్‌పై వెళ్తున్న వడ్డారపు రాజిరెడ్డి (60)ని లారీ ఢీ కొనడంతో మృతి చెందారు. గురువారం తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా కంటెయినర్ ఢీకొనడంతో అకిటి చైత్ర(13) మృతి చెందింది. భోరజ్ వద్ద రహదారిపై జైనథ్, బేల మండలాలకు వెళ్లడానికి సర్వీస్ రోడ్డు లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భోరజ్, ఇతర గ్రామాల ప్రజలు, స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించారు. మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా అధికారులు స్పందించి, ఎన్‌హెచ్ అథారిటీ అధికారులతో మాట్లాడుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు.