బోథ్, ఆగస్టు 31: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. బోథ్ మండలంలో మంగళవారం పర్యటించారు. మొదటిసారిగా మండలానికి వచ్చిన అదనపు కలెక్టర్‌ను ఎంపీపీ తుల శ్రీనివాస్ సన్మానించి, పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. వర్షాలు పడుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పొచ్చెర రైతువేదిక నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉద్యానవనం తీరుపై అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో సీహెచ్ రాధ, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఇన్చార్జి ఈవో అంజయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ జేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. మండలకేంద్రంలో ఆయన పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అన్నిశాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. లోలెవల్ వంతెనలు, కల్వర్టులు, జలపాతాల వద్ద ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కార్యాలయ ఆరవణలో మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఎంపీడీవో దుర్గం శంకర్, పీఆర్ఏఈ నారాయణ, విద్యుత్‌శాఖ ఏఈ సదానందం, ఎంపీవో మహేందర్‌రెడ్డి, కాద్యదర్శి సాయిప్రసాద్ పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డును మంగళవారం పరిశీలించారు. పార్కు వద్ద మొక్క నాటారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించేలా పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిత్యం ట్రాక్టర్ ద్వారా చెత్తను డంప్ యార్డుకు తరలించాలన్నారు. దోమల మందు పిచికారీ చేయించాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్‌ను జడ్పీటీసీ జాదవ్ అనిల్ సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్, సర్పంచ్ పెంట వెంకటరమణ, నాయకులు గాదె శంకర్, సిబ్బంది పోశెట్టి పాల్గొన్నారు.