రూ.13లక్షలతో అభివృద్ధి పనులు
శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంప్‌యార్డు, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లతో మెరుగులు
నార్నూర్, ఫిబ్రవరి 18 : గతంలో పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉండేవి. ఇక అనుబంధ గ్రామాల పరిస్థితి మరీ దారుణం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం చిన్న గ్రామాలతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీలకు శ్రీకారం చుట్టారు. జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధికి పల్లె ప్రగతి పేరిట ప్రత్యేక నిధులు కేటాయించింది. దీంతో చిన్న పంచాయతీలు ప్రగతిలో దూసుకెళ్తున్నాయి. కొత్త హంగులతో కళకళలాడుతున్నాయి. గాదిగూడ మండలంలో కొత్తగా ఏర్పడిన రూపాపూర్ పంచాయతీ ప్రగతి కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నది. గ్రామంలో 739 జనాభా, 179 కుటుంబాలు ఉన్నాయి. జనాభా ప్రకారం పంచాయతీకి నెలకు రూ.1.14 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఈ నిధులతో పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలో రూ.12లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.60లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.30 వేలతో డంప్‌యార్డు, రూ.1.75లక్షలతో సీసీరోడ్డు, రూ.30వేలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఎవెన్యూప్లాంటేషన్ కింద 400 మొక్కలు పెంచుతున్నారు. రూ.9.50లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్ ఏర్పాటు చేశారు. నిత్యం చెత్తాచెదారం సేకరణకు, మొక్కలకు నీరు పట్టేందుకు, పంచాయతీ పనులకు వినియోగిస్తున్నారు. 350 కుంటుబాలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. వీధుల్లో ఇద్దరు పంచాయతీ కార్మికులకు ప్రతి నెలా రూ.17,500 చెల్లిస్తున్నారు. 59 విద్యుత్ స్తంభాలు ఉండగా రూ.32వేలతో నూతనంగా తొమ్మిది స్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రతి స్తంభానికి ఎల్ఈడీ బల్బులు బిగించారు. మొకాసిగూడ నుంచి ఎస్సీగూడ వరకు రూ.32వేలతో గ్రావెల్‌రోడ్డు వేశారు. 110 ఇంకుడు గుంతలు నిర్మాణం పూర్తి చేశారు. 79 మంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. మిషన్ భగీరథ శుద్ధజలం ఇంటింటా సరఫరా అవుతున్నది. పాలకవర్గం సహకారంతో సర్పంచ్ పంచాయతీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
అభివృద్ధి పనుల్లో ముందంజ
పల్లె ప్రగతిలో భాగంగా రూపాపూర్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కొత్త పంచాయతీ కావడంతో అన్ని వసతులు, సౌకర్యాలు సమకూరాయి. వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. జిల్లా, మండల స్థాయి అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పనులు చేపట్టాం. ప్రజలు, పాలకవర్గ సభ్యులు అభివృద్ధికి సహకరిస్తున్నారు. -కుడ్మెత సోంబాయి, సర్పంచ్, రూప్పాపూర్