మంచిర్యాల టౌన్/సీసీసీ, ఆగస్టు 24: పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంచిర్యాలలోని షాదీఖానలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 116 మంది, సీసీసీ నస్పూర్ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్లో 68మందికి చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ. లక్షా నూట పదహారు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు మంచిర్యాల నియోజకవర్గంలో 2వేల మందికి లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. తాజాగా మంచిర్యాలలో మంగళవారం ఆరుగురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, 10 ఈబీసీలు, 14 మైనార్టీలు, 82 మంది బీసీలకు చెక్కులు అందించినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నియోజకవర్గంలో పారదర్శకంగా అందించామని చెప్పారు. సొంతింటి మనుషులే చేయలేనంత పెద్ద సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని, అలాంటి గొప్ప మనిషికి అవసరమైన సందర్భంలో అండగా నిలిచి కృతజ్ఞత చాటుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, తహసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు గాదెసత్యం, సుదమల్ల హరికృష్ణ, పోరెడ్డి రాజు, శ్రీలత, బానేశ్, ప్రకాశ్ నాయక్, అంకం నరేశ్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ వెంకటేశ్, నాయకులు ఎర్రం తిరుపతి, చంద్రశేఖర్ హండే, గౌసోద్దీన్, సీసీసీలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, తహసీల్దార్ జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, కౌన్సిలర్లు పంబాల గంగ, బండి పద్మ, చిడాం మహేశ్, బెడికె లక్ష్మి, పూదరి కుమార్, కోఆప్షన్ సభ్యులు నాసర్, పెరుమాళ్ల భాగ్యలక్ష్మి, నాయకులు జక్కుల రాజేశం, దగ్గుల మధుకుమార్, ఇండ్ల కిరణ్, నోముల నరేందర్‌రెడ్డి, చెల్ల విక్రమ్, కాటం రాజు, జాడి భానుచందర్, కందుల ప్రశాంత్ పాల్గొన్నారు.
ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషి
తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్లే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద నాకు లక్షా నూట పదహారు రూపాయల చెక్కు మంజూరవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పైసలు మాలాంటి పేదోళ్లకు ఎంతో మంచిగ ఉపయోగపడుతయి. అప్పులు తెచ్చి పెండ్లి చేయకుండా ప్రతి తల్లిదండ్రులకు చేదోడు అయితయ్. ఇంత మంచి ఆలోచన చేసి, ఎందరో జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి సారుకు పేదోళ్లందరం రుణపడి ఉంటం.
-చాపిడి మౌనిక, రాజీవ్‌నగర్
చాలా సంతోషంగా ఉంది
ఇటీవలే మా అమ్మాయి భవానికి పెండ్లి చేసినం. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే మాకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్షా నూట పదహారు మంజూరయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సాయం ప్రభుత్వం నుంచి అందుకోవడం మర్చిపోలేం. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వానికి కచ్చితంగా అండగా నిలుస్తం. గతంలో ఇట్ల మంచి పథకాలను పెట్టిన గవర్నమెంటు ఒక్కటీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం. పెండ్లికి పెద్దదిక్కోలే మేనమామ సారె పంపినట్లు ఆయన సాయం చేస్తుండడం ఆనందంగా ఉంది.
ఆనందంగా ఉంది
ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి సాయం అందడం ఎంతో ఆనందంగా ఉంది. ఆడపిల్ల పెండ్లికి అండగా నిలుస్తున్న ఏకైక సీఎం దేశంలో కేసీఆర్ సారు ఒక్కరే. పేదింట ఆడబిడ్డల పెండ్లంటే ఎన్నో ఇబ్బందులు ఉంటయి. ప్రభుత్వం ఇస్తున్న ఈ సాయం ఎంతో పెద్దది. అందరి గుండెల్లో ఆనందం నింపి, సీఎం కేసీఆర్ దేవుడైతున్నడు. ఇంటికి పెద్ద కొడుకులా అండగా నిలుస్తున్నడు. ఇలాంటి సంక్షేమ పథకం నిజంగా చాలా విలువైంది. దేశంలో ఎందరో ఆడబిడ్డల తల్లిదండ్రులు పెండ్లిళ్లు చేయలేక గతంలో బలవన్మరణం పొందిన్రు. ఇప్పుడు ఇలాంటి సాయం అందుతున్నది కాబట్టే ధైర్యంగా ఉంటున్నరు.
-వన్నోజుల తిరుమల, మంచిర్యాల
నమ్మలేక పోతున్నా ..
షాదీ ముబారక్ పథకం కింద లక్షా నూట పదహారు రూపాయల చెక్కు అందుకోవడం నిజంగా నేను నమ్మలేకపోతున్నా. ఇంతపెద్ద ఎత్తున సాయం ప్రభుత్వం నుంచి అందడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సారు మంచి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు సాయం చేస్తున్నరు. ఆయన మాకు దేవుడితో సమానం. నాతోపాటు మా కుటుంబమంతా ఎల్లకాలం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఉంటాం.
ఆడబిడ్డకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా ఉంటున్నది. పేదింట్లో ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ అందిస్తున్న కల్యాణలక్ష్మి కానుక చాలా అద్భుతం. ఇలాంటి సాయంతో ఆడపిల్లలకు మంచి జరుగుతుంది. వారు గౌరవంగా బతికే వీలుంటుంది. దేశంలో ఇలాంటి సాయం ఇస్తున్న దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆయన అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నడు. ఇట్లాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
-శృతి వేముల, రాంనగర్, మంచిర్యాల
ఎన్నటికీ మర్చిపోలేం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు చేస్తున్న ఈ సహాయాన్ని ప్రతి ఆడ పిల్ల, వారి తల్లిదండ్రులు మర్చిపోలేరు. తెలంగాణ ప్రభుత్వం అందించిన సహాయంతో నిజంగా ప్రతి ఇంటి ఆడబిడ్డ సంతోషంగా ఉంటుంది. సీఎం కేసీఆర్‌ను, వారు చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. మాకు చెక్కు వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే దివాకర్‌రావుకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు. గతంలో ఏ ప్రభుత్వం చేయని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నడు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నడు. పేదలతో పాటు అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నడు. ఆడబిడ్డల పెండ్లికి ఇంత పెద్ద సాయం చేస్తున్నడు. ఆయన సల్లంగుండాలె.
-రచన, మంచిర్యాల