
బేల, సెప్టెంబర్ 23 : రైతులు వ్యవసాయంతో పాడిపై దృష్టిసారించాలని విజయడెయిరీ ఉప సంచాలకుడు మధుసూదన్ అన్నారు. బేల మండల కేంద్రంలోని కేతాజీ మహరాజ్ పాల కేంద్రం ఆధ్వరంలో గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని రైతులకు, నిరుద్యోగ యువతకు బ్యాంకు రుణాలిచ్చి పాడిపరిశ్రమకు చేయూతనిస్తున్నట్లు తెలిపారు. విజయడెయిరీ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడంతో మండలంలోని రైతులు పాలు పోసి లాభాలు పొందాలని సూచించారు. విజయడెయిరీకి పాలు పోసే రైతులకు పెళ్లి కానుకగా రూ.5 వేలు, పాడి రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.5 వేలు, పాడి రైతు బ్యాంకు ద్వారా పశువులు కొనుగొలు చేస్తే రూ.10 వేలు సబ్సిడీ వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లోని రైతులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గోపాల్, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ రాఘవేంద్ర, సీపీఎఫ్ సంస్థ సభ్యుడు సత్యనారాయణ, కేతాజీ మహరాజ్ పాల డెయిరీ సంఘం అధ్యక్షుడు మంగేశ్ ఠాక్రే, పాడి రైతులు మస్కే తేజ్రావ్, సాగర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.