
ఎదులాపురం/నిర్మల్ టౌన్/భైంసా, ఆగస్టు 24 : విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 నుంచి తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సత్వరమే పూర్తిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావు, మున్సిపల్ శాఖ కమిషనర్ సత్యనారాయణ, పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీదేవసేనతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వైరస్ నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకొని సెప్టెంబర్ 1 నుంచి తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, తరగతి గదులను అందంగా తీర్చిదిద్దాలన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మరుగుదొడ్లు, వంటశాలలను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని తెలిపారు. ఇందుకు మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు.
సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. లోటుపాట్లు లేకుండా మండలస్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించి, వసతులు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలన్నారు. తల్లిదండ్రులు కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే భయాందోళనలో ఉన్నారని, విద్యార్థులను బలవంతంగా పాఠశాలలకు తీసుకురావద్దని సూచించారు. నిబంధనల మేరకే స్వచ్ఛందంగా పాఠశాలలకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పీహెచ్సీలో నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషరఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, విజయలక్ష్మి, డీఈవోలు రవీందర్ రెడ్డి, ప్రణీత, డీపీవోలు డీపీవో శ్రీనివాస్, వెంకటేశ్వర్రావు, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ మిల్కా, నిర్మల్ జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, జిల్లా అధికారులు, భైంసా తహసీల్ కార్యాలయంలో ఎంఈవోలు సుభాష్, చంద్రకాంత్, ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.