
ఆదిలాబాద్, ఆగస్టు 24 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సర్కారు అందిస్తున్న వైద్య సేవలతో సీజనల్ వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించింది. గ్రామాల్లోని పీహెచ్‌సీల్లో సైతం గర్భిణులకు ప్రసవం పొందేందుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 ప్రసవాలు జరుగుతున్నాయి. కరోనాకు సైతం గ్రామాల్లో వైద్యం అందేలా సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనుమానితులకు ర్యాపిడ్ టెస్ట్‌లు చేయడం.., పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి కార్యక్రమాలను వైద్యశాఖ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులకు సర్కారు అందిస్తున్న వైద్య సేవల కారణంగా సర్కారు దవాఖానలకు వచ్చే పేదల సంఖ్య గణనీయంగా పెరిగింది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఇబ్బందులు పడకుండా వైద్యలు, సిబ్బంది నియమకాలు, మందులు, ఇతర వైద్య సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. సర్కారు దవాఖానలకు వచ్చే వారికి కార్పొరేట్ తరహాలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
టెలీ కన్సల్టేషన్ విధానంలో చికిత్స..
ఆదిలాబాద్ జిల్లాలో 22 పీహెచ్‌సీలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. పేదలు వివిధ రకాల వ్యాధులతో పట్ణణ ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామాల్లోనే వైద్య నిపుణుల సహకారంతో మెరుగైన వైద్యం అందించేందుకు టెలీ కన్సల్టేషన్ విధానాన్ని అధికారులు అమలుచేస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఈ విధానం ద్వారా వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని పీహెచ్‌సీల్లో ట్రయల్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ శాంతినగర్ దవాఖాన నుంచి టెలీ కన్సల్టేషన్ విధానంతో హైదరాబాద్ నిమ్స్ వైద్యులతో స్థానిక డాక్టర్లు మాట్లాడారు. ఆరోగ్య సమస్యలతో దవాఖానకు వచ్చే వారికి ఆదిలాబాద్ రిమ్స్, హైదరాబాద్ నిమ్స్‌లో వైద్య నిపుణులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పీహెచ్‌సీల వైద్యులు రోగి వివరాలు తెలియజేస్తారు. ఆన్లైన్లో వైద్య నిపుణులు రోగితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. పెద్దాసుపత్రుల్లోని వైద్యులు రోగికి సంబంధించిన మందులు, అందించాల్సిన చికిత్స వివరాలను ఆన్లైన్లో పీహెచ్‌లు, సీహెచ్‌సీల వైద్యులకు సూచిస్తారు. ఈ మేరకు బాధితులకు చికిత్స అందిస్తారు. వ్యాధి తగ్గకపోతే మరోసారి నిపుణులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయిస్తారు. వీటి ఆధారంగా వ్యాధి తగ్గే దాకా వైద్యం అందిస్తారు.
అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం..
ఆదిలాబాద్ జిల్లాలో పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లతో వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టెలీ కన్సల్టెంట్ విధానం అమలుచేస్తున్నాం. జిల్లాలోని 22 హీహెచ్సీలు, 5 యూపీహెచ్‌సీల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరగుతున్నాయి. ఇంటర్నెట్ సమస్య ఉన్న మారమూల పీహెచ్‌సీలకు వచ్చే వారిని ఇతర దవాఖానలకు తీసుకెళ్లి, వైద్య నిపుణులకు చూపిస్తాం.