100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కార్యాచరణ
నేటి నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు
పక్కాగా అమలుకు మండల, జిల్లా స్థాయిలో పరిశీలన బృందాలు
పరీక్షలకు హాజరుకానున్న 10,982 మంది విద్యార్థులు
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 20 : మే 11వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, జిల్లా విద్యాశాఖ మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు నేటి నుంచి ఉదయం, సాయంత్రం తరగతులు నిర్వహించి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నది. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పాఠాలు బోధించడమేగాకుండా పిల్లల్లో మానసిక ైస్థెర్యాన్ని నింపుతున్నది. సెలవులు మినహా ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే వరకూ ప్రణాళిక పక్కాగా అమలు చేయనుండగా, ఇందుకోసం మండల, జిల్లా స్థాయిలో పరిశీలన బృందాలను ఏర్పాటు చేస్తున్నది.
మే 11వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అందులో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. కరోనాతో ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాల లోపాలున్నా యి. దీనికితోడు పరీక్షా విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఇందుకు తగ్గట్టుగా విద్యార్థులను సన్నద్ధం చేయడం, ఉత్తమ ఫలితాలు రాబట్టడం కోసం నిపుణులైన ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దీనిని క్షేత్ర స్థాయి లో పకడ్బందీగా ఈ నెల 21వ తేదీ నుంచి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
శతశాతం ఫలితాలే లక్ష్యంగా..
పదో తరగతిలో శతశాతం ఫలితాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నా రు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థుల విషయంలో, పాఠ్యాంశాల రివిజన్ కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకు రెండు పూటలు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. వారాంతంలో పరీక్ష నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించనున్నారు. వారిలో విద్యా సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయనున్నారు.
21 నుంచి కార్యాచరణ అమలు
జిల్లాలోని 293 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 10,982 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. ఇందులో 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 4,179 మంది పదో తరగతి విద్యార్థులుండగా.. 18 కేజీబీవీల్లో 711 మంది, ఐదు మోడల్ పాఠశాలల్లో 497 మంది, మూడు మైనార్టీ పాఠశాలల్లో 170 మంది విద్యార్థులున్నారు. ప్రైవేటుకు దీటుగా ఫలితాలు రాబట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల ల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా వారి లో నైపుణ్యాలను మెరుగుపరిచి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నారు. సెలవులు మినహా పది పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు ప్రణాళిక అమలు చేయనున్నారు. పక్కాగా అమలు జరిగేందుకు మం డల, జిల్లా స్థాయిలో పరిశీలన బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
మెరుగైన ఫలితాలే లక్ష్యంగా..
మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొంధించాం. ఈ నెల 21వ తేదీ నుంచి దీనిని పక్కాగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ రోజు ఏయే పాఠ్యాంశాలు బోధించాలో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులకు సూచించడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, రివిజన్ టెస్టులు, ఫలితాలపై సమిక్షలు నిర్వహిస్తాం. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి వారిలో విద్యా సామర్థ్యాలు పెంపొంధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తాం.
– ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి, మంచిర్యాల