
జైనథ్, జూలై 29 : ప్రస్తుతం పత్తిపంటలో గులాబీరంగు పురుగు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏఈవో తౌషిప్ సూచించారు. పత్తిపంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండలంలోని కౌఠ రైతువేదికలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏఈవో మాట్లాడారు. పత్తిపంటలో ఎకరాకు 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గులాబీరంగు పురుగు నివారణకు వేపనూనె 1500 పీపీఎం లీటరు, థయోడికార్భ్ (లార్విన్) 400 గ్రా. లేదా వేపనూనె, ఫోఫినోపాస్ 400 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పత్తికి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు పాల్గొన్నారు.
పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి
పత్తి సాగు చేస్తున్న రైతులు గులాబీ పురుగుపై అప్రమత్తంగా ఉండాలని ఏఈవోలు నగేశ్, రమణ, దీప్తి సూచించారు. మండలంలోని సాంగిడి, కొబ్బాయి, మసాల గ్రామాల్లో పత్తి పంటలను గురువారం పరిశీలించారు. పత్తి పంటలో ఆశించే గులాబీ పురుగుపై అవగాహన కల్పించారు. పత్తిలో పురుగులు కనిపించినట్లయితే నీమ్ ఆయిల్, ప్రొఫెన్ఫాస్ 250 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు. పంటలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
గులాబీ పురుగును అరికట్టాలి
పత్తి పంటను ఆశించే గులాబీ పురుగును అరికట్టాలని ఏఈవోలు దేవేందర్, వినయ్‌కుమార్ సూచించారు. మండలంలోని కోపర్ఘడ్ లో సాగుచేస్తున్న పత్తి పంటలను గురువారం పరిశీలిం చారు. గులాబీ పురుగుపై రైతులకు అవగాహన కల్పించారు. గులాబీ రంగు పురుగు లార్వాలు గుడ్లనుంచి బయటికి వచ్చిన వెంటనే పువ్వు మొగ్గలకు, లేత కాయల్లోకి ప్రవే శిస్తుందన్నారు. దీంతో పువ్వు మొగ్గలు గుడ్డిపూలుగా మారు తాయన్నారు. లేతకాయల్లో గింజల్ని తింటూ అందులోని దూది నాణ్యతను తగ్గిస్తుందని వివరించారు. ఈ పురుగు ఉనికిని గుర్తించడానికి ఎకరాకు 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలన్నారు. బుట్టల్లో వరుసగా మూడు రోజుల్లో 7 లేదా 8 రెక్కల పురుగులు పడితే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాలని తెలిపారు. లింగాకర్షక బుట్టలను ఏ విధంగా అమర్చుకోవాలో రైతులకు వివరించారు. వీటివల్ల గులాబీ రంగు పురుగులను తొలిదశలోనే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో రైతులు చిక్రం తులసీరామ్, దేవ్‌రావ్, మంగల్ చంద్, ఇస్రు, కల్లు, రమేశ్ పాల్గొన్నారు.