నిర్మల్ టౌన్, ఆగస్టు 24 : నిర్మల్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట సర్వే పక్కాగా చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో మంగళవారం పంట కల్లాల నిర్మాణం, పంట సర్వే వివరాల నమోదు, రైతుబీమా తదితర అంశాలపై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పంట సర్వే ఆధారంగా భవిష్యత్‌లో పంట కొనుగోళ్లు చేసే అవకాశం ఉందన్నారు. సర్వే ఆధారంగానే ఏ రకం పంట, ఎంత విస్తీర్ణంలో పండిందో ఈ లెక్కల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ నెల 31లోపు జిల్లా పరిధిలోని 79 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో పంట సర్వేలను పూర్తి చేసి పూర్తి వివరాలు అందించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పంట కల్లాలను పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేలా చూడాలన్నారు. రైతుబీమా పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మిషన్ భగీరథ పథకంపై జిల్లా అధికారులతో మాట్లాడారు. వర్షాకాలం సీజన్లో నీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. లీకేజీలను వెంటనే అరికట్టాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, అధికారులు పాల్గొన్నారు.