మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 8: మంచిర్యాల మున్సిపాలిటీకి నూతన చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక ఈ నెల 9న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఆర్డీవో ఎన్నికల అధికారి వాడాల రాములు, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ పరిశీలించారు. కౌన్సిల్ హాలులో ఉదయం 11 గంటలకు చైర్మన్, 11.30 గంటలకు వైస్‌చైర్మన్ ఎన్నికలను నిర్వహించనున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని 36 మంది కౌన్సిలర్లలో 18 మంది కౌన్సిలర్లు హాజరైతేనే కోరం ఉన్నట్లు భావించి సమావేశం నిర్వహిస్తామని, అనంతరం చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తామని ఆర్డీవో రాములు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత ఈనెల 3వ తేదీనే 26మంది కౌన్సిలర్లు గోవాకు తరలివెళ్లారు. వీరంతా శుక్రవారం శిబిరం నుంచి నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరుకానున్నారు.