అటవీ శాఖ అనుమతులతో ప్రధాన రోడ్లకు మహర్దశ
రూ.100 కోట్లతో నిర్మల్ టూ ఖానాపూర్ హైవే నిర్మాణం
రూ.10 కోట్లతో అడెల్లి టూ బోథ్ రోడ్డు పనులు..
విస్తరించనున్న రోడ్డు, రవాణా రంగం
నిర్మల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల కాలం నుంచి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లభించకపోవడంతో నిర్మల్‌లోని అనేక మారుమూల ప్రాంతాలకు కనీస రోడ్డు సౌకర్యం లేదు. రిజర్వ్ ఫారెస్టు పరిధి గుండా రోడ్లు నిర్మించాల్సి వస్తుండడంతో అటవీశాఖ అనుమతులు సమస్యగా మా రాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులు కేంద్ర ప్ర భుత్వం ఆధీనంలోని అటవీ, పర్యావరణ శాఖ ద్వారా అనుమతులను సాధించడంలో విఫలమయ్యారు. కాగా.. రాష్ట్రం ఏర్పడి న నాటి నుంచే మారుమూల పల్లెలకు రోడ్డు నిర్మాణాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రం గంలోకి దిగాల్సి వచ్చింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం అనుమతుల సాధనకోసం తనవంతుగా అనేక ప్రయత్నాలు చేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఒక్కో రోడ్డుకు సంబంధించిన సమస్య పరిష్కారమవుతూ వస్తున్నది.
పెండింగ్ సమస్యలకు మోక్షం..
ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న నిర్మల్ టూ ఖానాపూర్ వయా జగిత్యాల వరకు నిర్మించతలపెట్టిన 61వ నంబర్ జాతీయ రహదారికి సంబంధించి మొదటి దశ పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కనకాపూర్ నుంచి ఖానాపూర్ వరకు 27 కి.మీ మేర చేపట్టేబోయే హైవే పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో పాటు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కూడా ఈ హైవే నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. దాదాపు రూ.100 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న అడెల్లి టూ బోథ్ ప్రధాన రోడ్డు నిర్మాణానికీ ఇటీవలే అటవీశాఖ అనుమతులు జారీ చేసింది. దాదాపు రూ.10 కోట్లతో ఈ పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. దాదాపు 20 ఏండ్ల నుంచి ఈ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవడం, సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి బృందం సంప్రదింపులు చేయడంతో అనుమతులను లభించాయని అంటున్నారు.
పెరిగిన అంచనాలతో ప్రతిపాదనలు..
61వ నంబర్ జాతీయ రహదారికి సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేసిన సిఫారసుల మేరకు కనకాపూర్ నుంచి ఖానాపూర్ వరకు నిర్మించే రోడ్డు నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఈ రోడ్డు మార్గంలో ఏడు చోట్ల వన్య ప్రాణులు తిరిగేందుకు వీలుగా అండర్ పాస్‌లను నిర్మించాలని ఎన్జీటీ ఆదేశించింది. తొలగించే ప్రతి చెట్టుకు బదులుగా పది మొక్కలు నాటాలని సూచించింది. దీంతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణం కోసం కేటాయించిన రూ.100 కోట్లకు అదనంగా మరో రూ.50 కోట్లు అవసరముంటాయని భావించిన అధికారులు.. తాజా అంచనాలను రూపొందిస్తున్నారు.
విస్తరించనున్న వాణిజ్య, రవాణా రంగం..
నిర్మల్ నుంచి ఖానాపూర్ మీదుగా జగిత్యాల వరకు నిర్మించనున్న 61వ నంబర్ జాతీయ రహదారితో నిర్మల్ జిల్లాకు అత్యధిక ప్రయోజనాలు దక్కనున్నాయి. ముఖ్యంగా రవాణా రంగంతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలు విస్తరిస్తాయి. నిర్మల్ జిల్లా.. జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో అనుసంధానం అవుతుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాలకు ఈ హైవే ద్వారా లింకేజీ ఏర్పడనుంది. దీంతో వ్యాపార, వాణిజ్య రంగాలు విస్తరించడమే కాకుండా రవాణా, పారిశ్రామిక రంగాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
పనులు వేగంగా సాగుతున్నాయి..
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీశాఖ అనుమతులు క్లియర్ కావడంతో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పర్యావరణ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో రోడ్డు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేదు. ఎన్జీటీ సూచనల మేరకు ఏడు చోట్ల అండర్ పాస్‌ల నిర్మాణం చేపడుతున్నాం.
– సుభాష్, ఎన్హెచ్డీఈఈ నిర్మల్