ముమ్మరంగా బోథ్ – నిగిని డబుల్ రోడ్డు నిర్మాణ పనులు
సీఆర్ఎఫ్ నిధులు రూ.19 కోట్లు మంజూరు
బోథ్, మార్చి 13 : 17 గ్రామాల ప్రజలు ఇన్నాళ్లు పడిన కష్టాలకు మోక్షం లభించబోతున్నది. అధ్వానంగా ఉన్న రోడ్డుపై రాకపోకలు సాగించలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున గుంతలతో నిత్యం ప్రమాదాల బారిన పడేవారు. అత్యవసర సమయంలో మండల కేంద్రానికి చేరుకోవడానికి గంటల తరబడి ప్రయాణించాల్సిన దుస్థితి నుంచి మోక్షం లభించనుంది. ఎన్నో ఏళ్లుగా 17 గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోథ్ నిగిని డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.
రూ. 19 కోట్లతో 14 కిలో మీటర్లు
బోథ్ నుంచి మర్లపెల్లి మీదుగా నిగిని వరకు 14 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా మారింది. అప్పటి సీమాంధ్ర పాలకులు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు కష్టాలతో కాలం వెల్లదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ బోథ్ నుంచి నిగిని వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఎఫ్ (సెంట్రల్ రోడ్డు ఫండ్) నిధులు రూ.19 కోట్లు మంజూరు చేయించారు. మూడేళ్ల కిందట పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మొదలు పెట్టలేదు. మాజీ ఎంపీతో పాటు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేలా చేశారు. ప్రస్తుతం నిగిని నుంచి బోథ్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డుకు గాను ప్రస్తుతమున్న 3.6 మీటర్ల రోడ్డుకు ఇరువైపులా కలిపి మరో 3.4 మీటర్లు తవ్వి మట్టిని నింపి రోలింగ్ చేస్తున్నారు. ఆ పనులు పూర్తయిన చోట కంకర వేసి నీటిని క్యూరింగ్ చేస్తూ రోలింగ్ చేయిస్తున్నారు. వచ్చే ఏప్రిల్లోగా పనులు పూర్తి చేసేలా కొనసాగిస్తున్నారు. దశాబ్ద కాలంగా తాము పడిన బాధలు మరికొద్ది రోజుల్లోగా తొలగిపోనుండడంతో 17 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రోడ్డు పూర్తయితే మహారాష్ట్రలోని షివిని, బోకర్, ఇస్లాపూర్, కిన్వట్, నాందేడ్ ప్రాంతాలకు వెళ్లడానికి దూరభారం తగ్గుతుంది.
గుంతలమయం రోడ్డుతో ఇబ్బందులు పడ్డాం
గుంతలమయంగా మారిన రోడ్డుతో ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలంలో నరకయాతన అనుభవించాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం మూలంగా కష్టాలు దూరమవనున్నాయి. మా ప్రాంతంపై ప్రత్యేక అభిమానంతో మాజీ ఎంపీ నగేశ్ డబుల్ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించారు. ఎప్పటికీ మర్చిపోలేం.
– అనిల్ సింథే, గ్రామస్తుడు, మర్లపెల్లి