‘నమస్తే’ కథనానికి స్పందన
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 18 : ఆదిలాబాద్ మండలం అంకాపూర్ పంచాయతీ పరిధి మారుమూల గిరిజన గ్రామం గుండంలొద్ది గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఏటీడీవో ఆత్రం భాస్కర్ ఎస్ఆర్పీతో కలిసి తనిఖీ చేశారు. ‘సార్కు సహాయకుడు.. వలంటీర్ వస్తేనే బడి..’ అని ఈ నెల 16న ‘నమస్తే’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు అధికారులు ఉదయం 9 గం టలకు వెళ్లి 11 గంటల వరకు పాఠశాలను పరిశీలించారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. అయితే ఈ ఉపాధ్యాయుడు తమ పాఠశాలకు వద్దని, వేరే టీచర్ను నియమించాలని గ్రామస్తులు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. ‘నమస్తే’ పేర్కొన్నట్లుగా ఆ ఉపాధ్యాయుడు అసలు బడికే రారని, ఎప్పుడో ఒకసారి వచ్చినా తాగి ఉంటారని స్థానికులు విన్నవించారు. అధికారులు పరిశీలనకు వచ్చిన రోజున కూడా ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై ఏటీడీవో మాట్లాడుతూ.. ఈ నివేదికను పీవోకు పంపుతామని, అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. సర్కారు పేద, గిరిజన పిల్లల విద్యకోసం ఎంతో కృషిచేస్తున్నదని, ఉపాధ్యాయులు ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, అధికారులు వచ్చి స్పందించినందుకు స్థానికులు హర్షం వ్యక్తంచేశారు.