
నార్నూర్, ఆగస్టు 24 : గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని వైద్య సిబ్బందిని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. గాదిగూడ మండలం కునికసా పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో మంగళవారం ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రాతో కలిసి పర్యటించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. మాతా శిశు మరణాలను అరికట్టాలన్నారు. గర్భిణి రాజుబాయి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామానికి రోడ్డు, వాగుపై వంతెన లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారని, గాదిగూడ పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆమె స్పందించి, తప్పకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.25వేల చెక్కును అందించారు. కలెక్టర్ వెంట మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, ఏపీవో రమణ, తహసీల్దార్ ఆర్కా మోతీరాం, డాక్టర్ పవన్‌కుమార్, ఈఈ రాథోడ్ భీంరావ్, డీఈ జాదవ్ తానాజీ, ఏఈ రాథోడ్ సునీల్, సర్పంచ్ కొడప జంగు తదితరులు ఉన్నారు.