ఖానాపూర్ టౌన్ / పెంబి, ఆగస్టు 24: ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఖరారైంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ప్రతిపాదన మేరకు చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మొత్తం 14 మంది సభ్యులతో కొత్త మార్కెట్ కమిటీ కొలువుదీరబోతున్నది. ఉద్యమకారుడు పుప్పాల శంకర్ చైర్మన్‌గా నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా ఖానాపూర్ పట్టణానికి చెందిన యువ నాయకుడు గొర్రె గంగాధర్‌ను నియమించారు. డైరెక్టర్లుగా జక్కుల నవీన్ యాదవ్, పరాంకుశం శ్రీనివాస్, మహ్మద్ మెహ్రజుద్దీన్, రాథోడ్ పరశురాం, బొయిని మంగ, ఒడ్నాల సత్తెన్న, జీ. సదానందం, కట్కం విజయ్, అంకం రాజేందర్ (ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్)తో పాటు పీఏసీఎస్ చైర్మన్ సత్తనపెల్లి, జిల్లా మార్కెట్ శాఖ డీఎం, వ్యవసాయ శాఖ ఖానాపూర్ ఏడీఏలు డైరెక్టర్లుగా ఉంటారు. త్వరలో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమచారం.
ఉద్యమకారుడికే చైర్మన్ పదవి..
ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పెంబి మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ నియామకమయ్యారు. ఉద్యమకారుడికే చైర్మన్ పదవి లభించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుప్పాల శంకర్ 2001-2005 వరకు పెంబి సర్పంచ్‌గా చేశారు. కొన్నేండ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2003 లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పదవులు చేపట్టి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ ఆమె గెలుపునకు కృషి చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టడంతో పుప్పాల శంకర్ అభినందనలు తెలిపారు. మారుమూల గిరిజన మండలం నుంచి శంకర్‌కు చైర్మన్ పదవి లబించడంతో పెంబి మండల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.