
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 29: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మైదానాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆదివారం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నదన్నారు. క్రీడాకారులు పట్టుదలతో ప్రతిరోజూ సాధన చేసి పతకాలు సాధించే స్థాయికి ఎదగాలన్నారు. స్టేడియంలో మైదానాల మరమ్మతుకు ఇప్పటికే మున్సిపల్ నిధులు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని, త్వరలో మరిన్ని నిధులు విడుదల చేసి క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. సుమారు 250 మంది విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తున్న కోచ్‌లను అభినందించారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల విద్యార్థులు 148 పతకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావడం గర్వకారణమన్నారు. అనంతరం క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ శ్రీలత, ఎస్జీఎఫ్ కార్యదర్శి గుండి మహేశ్, వివిధ క్రీడా సంఘాల కార్యదర్శులు రాష్ట్రపాల్, విఠల్‌రెడ్డి, స్వామి, పీడీ కృష్ణ, కోచ్‌లు రవీందర్, భాస్కర్, రాజు పాల్గొన్నారు.
కేంద్రం నిధులైతే కార్యక్రమాల్లో పాల్గొనాలి..
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం నిధులుంటే బీజేపీ నాయకులు ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్లో సవారీ బంగ్లా పనులకు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులకు, ఖానాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించను న్న శ్మశానవాటికకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పేదల కోసం రాష్ట్రం లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని, అక్కడ ఇలాంటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్లు రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.