18 పాఠశాలల్లో 4800 మందికిగాను 5038 మంది విద్యార్థుల చేరిక
టీచర్ల కృషి ఫలితం.. అధికారుల ప్రశంసలు
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 19 ;కేజీబీవీల ఎన్రోల్మెంట్లో నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న విద్యపై అవగాహన కల్పించగా, విద్యార్థులు లక్ష్యానికి మించి చేరడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 18 పాఠశాలల్లో 4800 సీట్లకే అవకాశముండగా, 5038 మంది అడ్మిషన్లు తీసుకోవడంతో టాప్వన్లో నిలిచింది. టీచర్ల కృషితో గుర్తింపు రాగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. –
నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీలు ఉండగా, ఇందులో 8 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు కొనసాగుతున్నాయి. మొత్తం 4800 సీట్లకుగాను 5038 మంది విద్యార్థులు చేరారు. అంటే వీటిలో అదనంగా 238 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల్లో కార్పొరేట్ తరహాలో అధునాతన భవనాలను నిర్మిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. మరోవైపు మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా చర్యలు చేపడుతుండడంతో విద్యార్థులు వీటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వృత్తి విద్యాకోర్సులను సైతం ప్రవేశపెట్టి విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తున్నది. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్డబ్ల్యూ) కోర్సులను ప్రవేశ పెట్టడంతో విద్యార్థులు త్వరగా ఉద్యోగం వచ్చే కోర్సులను ఎంచుకుంటున్నారు. మామడ, కడెం, నిర్మల్ కేజీబీవీల్లో వృత్తి విద్యాకోర్సులుండగా, విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. జాం కేజీబీవీకి చెందిన కే.సాయిసింధు ఎంపీసీలో 442/470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. లక్ష్మణచాంద కేజీబీవీ విద్యార్థి టీ.రాణి బైపీసీలో 414/440 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానం, మామడ కేజీబీవీ విద్యార్థి బీ.వైష్ణవి సీఈసీలో 455/500 మార్కులు సా ధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది.
ఎన్రోల్మెంట్లో నంబర్ వన్
నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 4800 మంది విద్యార్థులు మాత్రమే చదువుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 5038 మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్వోలు ఉపాధ్యాయులతో కలిసి బృందాలుగా ఏర్పడి విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేశారు. ఇంటింటా తిరుగుతూ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న విద్యపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఒక్కో టీచర్ 40 మంది విద్యార్థులను చేర్పించారు. దీంతో అదనంగా 238 మంది విద్యార్థులు చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉండగా, ఎన్రోల్మెంట్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
చాలా సంతోషంగా ఉంది
జిల్లాలోని కేజీబీవీల ఎస్వోలు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల ఎన్రోల్మెంట్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాం. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెల్లో పర్యటించి చదువులకు దూరమవుతున్న విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. ఒక్కో టీచర్ 30నుంచి 40 మంది విద్యార్థులను ఎన్రోల్ చేయాలని చెప్పాం. వారి సహకారంతో లక్ష్యం చేరుకున్నాం. – సలోమి కరుణ, సెక్టోరియల్ అధికారి, నిర్మల్