
ఎదులాపురం,సెప్టెంబర్ 20 : వ్యాక్సిన్ సురక్షితమని, కు టుంబసభ్యులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక 37వ వార్డులోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను సోమవారం పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకుంటున్న వారితో కలెక్టర్ ముచ్చటించారు. 18 సంవత్సరాలు పై బడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. జిల్లాలో రోజుకు 21వేల మందికి వ్యాక్సిన్ అందించి బెంచ్ మార్క్‌ను చేరుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే లక్ష్యాలను సాధించే జిల్లాల్లో ఆదిలాబాద్ కూడా ఉందన్నారు. వైద్యం, మున్సిపల్, పంచాయితీరాజ్, ఉపాధి హామీ, తదితర శాఖల సమస్వయంతో జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించేందుకు, సెల్ నంబర్, డాక్టర్ వివరాలకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం వార్డు నంబర్ 37లోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలోని పలు ఇండ్లలోని వారితో మాట్లాడారు. గృహానికి అంటించిన స్టిక్కర్, వివరా లు నమోదును పరిశీలించారు. అనంతరం మున్సిపల్, వై ద్యాధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పట్టణంలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను మరింత చైతన్యపరిచి వందశాతం వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు మున్సిపల్ కమిషనర్ శైలజతో మాట్లాడారు. డైట్ మైదానంలోని చెత్తను తొలగించాలని, పనికిరాని వాటిని తరలించి పట్టణ ప్రగతిలో భాగంగా సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీఐవో విజయసారథి శ్రీనివాస్, డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, వార్డు కౌన్సిలర్ అంబకంటి అశోక్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, మెప్మా కోఆర్టినేటర్ భాగ్యలక్ష్మి, వైద్యసిబ్బంది ఉన్నారు.
కలెక్టర్, ఎస్పీలకు సన్మానం
గణేశ్ నిమజ్జన కార్యక్రమం విజయవంతానికి సహకరించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్‌చంద్రను సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం వేర్వేరుగా క్యాంప్ కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని సన్మానించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, గౌరవాధ్యక్షుడు డాక్టర్ ప్రపుల్ వాఝే, కార్యదర్శి గేడం మాధవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూర్యకాంత్, ఉపాధ్యక్షుడు బండారి దేవన్న, కోశాధికారి నర్సాగౌడ్, కృష్ణగౌడ్, విజయ్ కుమార్, రాజు, లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు.