నిర్మల్ టౌన్, ఆగస్టు 24 : తెలంగాణ సర్కారు పల్లెల అభివృద్ధికి ఎప్పటికప్పుడు అభివృద్ధి నిధులను విడుదల చేస్తున్నది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం పథకం కింద నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితమే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రూ.3 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాల్లో రూ.2.50 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రణాళికా సంఘం జీవో జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. 12 స్థానాలకు గాను రూ.32.50 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్.., ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్.., కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా పురాణం సతీశ్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వ్యవహరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్సీ పరిధిలో నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం పథకం కింద ఈ నిధులు ఖర్చుచేయనున్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిధులు మంజూరు చేయడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో మరింత వేగం పుంజుకోనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి ద్వారా నెలనెలా నిధులు విడుదల చేస్తున్నది. గ్రామాల్లో ప్రజల మౌలిక అవసరాలు 80 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులకు ఈ నిధులు ఖర్చు చేసే అవకాశం ఏర్పడింది. ఒక్కో నియోజకవర్గానికి రూ.2.50కోట్ల నిధులను విడుదల చేయడంతో వీటి నుంచి 20 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ఖర్చుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మిగతా నిధులతో ఎమ్మెల్యేలు సూచించిన పనులు చేపట్టనున్నారు. ఇందులో పాఠశాల ప్రహరీలు, కమ్యూనిటీ హాళ్లు, రహదారుల మరమ్మతులు, అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక, అత్యవసరాలను గుర్తించి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులను అభివృద్ధి చేసుకునే అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా నిధులను విడుదల చేయడం సంతోషంగా ఉందని జిల్లా ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.