ఆర్థికాభివృద్ధి సాధించేలాయూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి
అన్ని వర్గాలకూ సమాన హక్కులు కల్పిస్తున్నాం
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు
ఎదులాపురం,ఫిబ్రవరి 28 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులు ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాని, ఆర్థికాభివృద్ధి సాధించేలా యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్‌లోని టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో దళితబంధు లబ్ధిదారులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్ డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడారు. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమాన హక్కులు కల్పిస్తున్నదని చెప్పారు. దళితుల అభివృద్ధికి దళితబస్తీ, దళిత బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు. దళితబస్తీ పథకంలో భాగంగా 2583 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అర్హులకు పంపిణీ చేశామని, రాష్ట్రంలోనే బోథ్ నియోజక వర్గం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
లబ్ధిదారులకు పెట్టుబడి సాయం కూడా అందించినట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు యూనిట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. భూమి కొనుగోలు పథకంలో భాగంగా తాంసి మండలం పాలోడి గ్రామానికి చెందిన శారదకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఖర్చుల కింద మంజూరైన రూ.16,797 విలువైన చెక్కును కలెక్టర్, ఎమ్మెల్యే అందించారు. దళితబంధు పథకం కింద బోథ్ నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. బోథ్ మండలం చింతల్ బోరి-13, బజార్హత్నూర్ మండలం జాతర్ల- 22, ఇచ్చోడ మండలం మాదాపూర్-14, దాబా(బీ)-9, తలమడుగు మండలం డోర్లి-18, నేరడిగొండ మండలం కుంటాల(కే)-7, లక్కంపూర్-9, గుడిహత్నూర్ మండలం గోండ్ హర్కాపూర్లో 8 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. యూనిట్ల ఏర్పాటు, ఆదాయ, వ్యయాలపై అధికారులు అవగాహన కల్పిస్తారని, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, అడిషనల్ డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రంగారావ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, విజయ డెయిరీ డీడీ మధుసూదన్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.