నిర్మల్ టౌన్, ఆగస్టు 24 : జాతీయ ఆహార భద్రత చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని అధికారులను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్‌రెడ్డి ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఆకలి చావుల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చిందని, తెలంగాణ సర్కారు 2015 నుంచి అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. వివిధ సంక్షేమశాఖల ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నదని గుర్తుచేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా సంక్షేమ హాస్టల్లో ఉచిత వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వం జిల్లాలో 5,835 మందికి రేషన్ కార్డులను అందించిందని, ప్రతి లబ్ధిదారుడికీ నెలనెలా బియ్యం సక్రమంగా అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే చేసి, పౌష్టికాహారంతో పాటు వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్యశాఖకు సూచించారు.
ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను అమలుచేస్తున్నదని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని సూచించారు. జిల్లా, మండల, గ్రామీణస్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ టీంలను ఏర్పాటు చేసుకొని, ఆహార భద్రత చట్టంపై ప్రజలకు మరింత అవగాహన పెంచాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఆరోగ్య సంక్షేమ పథకాలను ఆయా శాఖల ద్వారా అమలుచేస్తామన్నారు. ఈ సందర్భంగా కుంటాల ఎంపీపీ గజ్జారాం మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మండల స్థాయిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్, విద్యాశాఖ అధికారి ప్రణీత, గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజేశ్వర్‌గౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజలింగం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి స్రవంతి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఆర్వో రమేశ్‌రాథోడ్, ఎంపీపీలు మైపాల్‌రెడ్డి, గజ్జారాం, రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.