నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 11 : గడిచిన తొమ్మిదేండ్లలో అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజలందరితో ఆత్మీయంగా ఉండేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో పది వార్డులకు చెందిన ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. పట్టణవాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాములతో కలిసి పార్టీ జెండాను మంత్రి ఎగురవేశారు.
మొదటగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధితోపాటు రానున్న రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడుతాయని స్పష్టం చేశారు. 60 ఏండ్లలో కాని ప్రగతిని కేవలం తొమ్మిదేండ్లలో వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిందన్నారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు కావడం, మెడికల్, నర్సింగ్ కళాశాలలు రావడంతో వైద్య రంగం అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ బద్నాం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లాను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగోండ రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, రాంకిషన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు జగడం యశోద, గండ్రత్ రమణ, వేణు, అయ్యన్నగారి రాజేందర్, జహీర్, చాహుస్, ముజాయిద్, నాయకులు కోటగిరి అశోక్, అప్పాల వంశీ, అఖిల్ రెబల్ పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు ఆగం చేస్తున్నరు..
ప్రశ్నపత్రాల లీకేజీతో పదో తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆగం చేసింది బీజేపీ నాయకులే విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న వారికి త్వరలోనే శిక్ష పడుతుంది. తొమ్మిదేండ్లతో 1.50 లక్షల మందికి పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది.
– నేరేళ్ల వేణు, కౌన్సిలర్, నిర్మల్.
పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి..
ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టా గంగాధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. కార్యకర్తలందరినీ దగ్గరికి చేర్చేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు తొమ్మిది ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకున్నామని, ఇంకా ఎనిమిది నిర్వహిస్తా మన్నారు. ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడం శుభ పరిణామం అన్నారు.
– ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్.
రూ.100 కోట్లతో 42 వార్డుల అభివృద్ధి..
మంత్రి ఐకే రెడ్డి కృషితో ఇప్పటికే అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాలు, వైకుంఠధామాలు కట్టించాం. సీఎం కేసీఆర్ త్వరలో నిర్మల్‌కు రానున్న నేపథ్యంతో రూ.100 కోట్లను మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి మంజూరుకు కృషి చేస్తున్నారు. రూ.100 కోట్లతో 42 వార్డుల్లో మిలిగిన పనులు పూర్తి చేస్తాం.
– ఈశ్వర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంతో నిర్మల్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాయి. సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యాయి. ప్రతిపక్ష నాయకులకు కూడా పథకాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది.
– గండ్రత్ రమణ, కౌన్సిలర్, నిర్మల్.