ఆదిలాబాద్ రూరల్, మార్చి 10: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా సాయమందిస్తూ ఆసరాగా నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం త్వరలోనే 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనుందన్నారు. జిల్లాలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించనుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా సొంత స్థలం ఉన్న వారికి రూ.3లక్షల చొప్పున త్వరలోనే గృహ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భరత్, అంజుబాయ్, నాయకులు శ్రీనివాస్, సునీల్, సంతోష్ పాల్గొన్నారు.