నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 18 : రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు, పట్టణ ప్రజలందరి సహకారంతోనే నిర్మల్ పట్టణంలో అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నదని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.45 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ మున్సిపల్ పరిధిలోని 48 శాతం బకాయిలను వెంటనే వసూలు చేసి త్వరగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. రెండేండ్ల కంటే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అధికంగా రూపొందించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ ఆదాయం పెరుగుతుందన్నారు. ఇంటి పన్నులు, గృహ నిర్మాణ అనుమతుల ద్వారా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 52 శాతం పన్నులు వసూలయ్యాయని, మిగతా 48 శాతం అధికారులు, కౌన్సిలర్లు సమష్టి కృషితో వసూలు చేయాలన్నారు. త్వరలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిర్మల్ మున్సిపాలిటీకి రూ.23 కోట్లు రానున్నాయని, అదనపు గ్రాంటు ద్వారా మరో రూ.20 కోట్లు మంజూరు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిపాదించారని చెప్పారు. ఆ నిధులతో అన్ని వార్డులను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను చైర్మన్, కౌన్సిల్ సభ్యులు శాలువాతో సత్కరించారు. చైన్‌గేట్ నుంచి బంగల్పేట్ వరకు కలెక్టర్ చొరవతో రోడ్డు వెడల్పు పనులను, రూ.1.60 కోట్లతో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జాతీయ పతాకం స్థలంలో సుందరీకరణ పనులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ సాజిద్, ఏఈ వినయ్ కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.