న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః
యానేవా హత్వా న జిజీవిషామః తేవస్థితాః ప్రముఖే ధార్త రాష్ర్టాః!
(భగవద్గీత – 2-6)
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సన్నద్ధమయ్యాయి. రణక్షేత్రం మధ్యలో అర్జునుడు సందిగ్ధానికి లోనయ్యాడు. ఇరు వర్గాలలో ఎవరు మరణించినా తనకే బాధ. అందుకే, యుద్ధం చేయలేనని అస్త్రసన్యాసం చేసి కర్తవ్యాన్ని ఉపదేశించమని కృష్ణుడిని కోరుతూ.. ‘కృష్ణా! ఈ యుద్ధం చేయడం శ్రేయస్కరమా..
చేయకపోవడం శ్రేయస్కరమా? సందిగ్ధత మనసును పీడిస్తున్నది. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. ఎవరం విజయం సాధిస్తామో తెలియదు!
ఆత్మీయులైన సోదరులు ప్రతిపక్షంలో నిలిచి యుద్ధం చేసే సమయంలో వారిని చంపి జీవించడం మనసుకు అంగీకారం కాకున్నది..’ అన్నాడు.
పుట్టిన ప్రతిజీవీ మరణిస్తుంది. నదిలో ప్రయాణించే నావికుడు తనకు ఇష్టమైన దిశలో ప్రయాణిస్తున్నంత మాత్రాన.. తాను నదీ ప్రవాహాన్ని నియంత్రించినట్లు కాదుకదా! అలాగే, మృత్యువనే హేతువును చూపుతూ యుద్ధం మంచిదా కాదా అనేది నిర్ణయింపలేం. ప్రతి వ్యక్తి జీవితానికి ప్రయోజనం ఉంటుంది. పుట్టిన నాటినుంచి మరణించేంత వరకు జీవితాన్ని ఎలా గడిపామన్నది జీవన ప్రయోజనాన్ని నిర్ణయిస్తుంది. భౌతిక సుఖాలను ఆశించి భోగభాగ్యాల కోసం స్వార్థపూరిత జీవితాన్ని సాగించడం ప్రేయస్సునిస్తుంది. ప్రేయస్సుకు అతీతమైన తన్మయత్వాన్ని అందించేది శ్రేయస్సు. అర్జునుడు యుద్ధం చేయడం వల్ల క్షాత్రధర్మాన్ని నిర్వహించిన వాడు అవుతాడు. అది ఉత్తమమైనది, శ్రేయస్కరమైనది. అయితే దానివల్ల జరిగే కులనాశనం దోషభరితమైనది. అందువల్ల ఏది ఆదరణీయమైనది?
మరొక సందేహం.. యుద్ధంలో మనమే జయిస్తామని నిర్ణయాత్మకంగా చెప్పలేం. ఎదుటివారూ గెలవవచ్చు. గెలుపు, ఓటమి అనే బాహ్యమైన పరిస్థితులను బట్టి సుఖదుఃఖాలు కలుగుతాయి. అనివార్యమైన వాటికి అతీతంగా స్పందిస్తూ జీవించడమే స్థితప్రజ్ఞత. అంతేకాదు, ‘కౌరవులు మరణానికి సిద్ధపడి పోరాడినా.. వారందరిని చంపి మేము జీవించడం వల్ల కలిగే విజయమూ నిరర్ధక విజయమవుతుంద’ని అంటున్నాడు అర్జునుడు. కర్తవ్య నిర్వహణలో యుక్తాయుక్తాలను నిర్ణయించుకోలేని అసమర్థతను గుర్తించడం ఒకెత్తు కాగా, దానిని సమర్థుడైన మార్గదర్శకుడి ముందు వెల్లడించి సరైన సలహాను తీసుకోవడం విజ్ఞత. అర్జునుడు ఇక్కడ ఆ విజ్ఞతను ప్రదర్శించాడు.
మనలో చాలామందిమి, జీవన ప్రయోజనాన్ని గుర్తించడం, దానిని సిద్ధింప చేసుకోవడంలో సందిగ్ధతకు లోనవుతాం. సంతోషమనే ఎండమావుల వెంట మరణ సమయం వరకూ అనిశ్చిత పరిస్థితులతో పరుగులు తీస్తూనే ఉంటాం. సంతోషమనేది చేరాల్సిన లక్ష్యం కాదు.. సాధించాల్సిన మానసికస్థితిని విస్మరిస్తుంటాం. ఆ ప్రయాణంలో అందుకున్న చిన్న విజయాలను ఆస్వాదించడంలో విఫలమవుతూ గానుగెద్దు జీవితాన్ని గడిపేస్తుంటాం. మన జీవన గమనంలో గడించిన విలువైన అనుభవాలు ఎన్నెన్నో జీవిత పాఠాలను బోధిస్తుంటాయి. వాటిని గుర్తించి ఆచరించి భావితరాలకు అందించడం లక్ష్యంగా అవసరమైన ఉత్తమ జీవన లక్ష్యాలను పునర్నిర్వచించుకోవాలి. మనకు మనమే సృష్టించుకోవాలి.
వ్యక్తి జీవితంలో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. చేతులు, తల, హృదయం. చేతులు మాత్రమే పనిచేస్తే అది శ్రామికస్థితిగానే మిగిలిపోతుంది. తల, చేతులు కలిసి పనిచేస్తే అది నైపుణ్యంగా భాసిస్తుంది. అంతేకాక, ఎప్పుడైతే తల చేతులు, హృదయం కలిసి పనిచేస్తాయో అప్పుడది కళగా ఆవిష్కృతం అవుతుంది. జీవిత గమనంలో చేస్తున్న ప్రతిపనీ చక్కని కళగా భావిస్తూ ఆనందంగా చేస్తున్నప్పుడు జీవిత ప్రయోజనం పరిమళిస్తుంది. దానినే జీవితాన్ని పునర్ నిర్వచించుకోవడం లేదా తిరిగి సృజించుకోవడంగా చెప్పుకొంటాం. ఈ ప్రక్రియలో అవసరమైనవి కలుపుకోవడాలు, అనవసరమైనవి తొలగించుకోవడాలు, కొత్తవి ఆవిష్కరించుకోవడాలు, ఉన్నవి సరి చేసుకోవడాల వల్ల వ్యక్తిలో జాత్యంతరీకరణ జరుగుతుంది.
సమకాలీన సమాజంలో దీనిని అన్వయించుకుంటే.. చేతులనేవి సాధారణ ప్రజలకు ప్రతీకలు. తల అనేది అధికారగణంగా భావించవచ్చు. హృదయాన్ని ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఈ మూడూ కలిసి పనిచేస్తేనే సంపద సృజన జరుగుతుంది. అభ్యుదయం సాకారమవుతుంది. శాంతి వెల్లివిరుస్తుంది….?
-పాలకుర్తి రామమూర్తి