ఓ ఊళ్లో ఒక జాలరి ఉండేవాడు. అతని కొడుకు పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. రెండు రోజుల సెలవు దొరికిందని జాలరి కొడుకు ఇంటికి వచ్చాడు. అదే సమయానికి జాలరి వల తీసుకుని చేపలు పట్టడానికి నదికి బయల్దేరుతున్నాడు. తను కూడా వస్తానని జాలరిని అనుసరించాడు కొడుకు. ఇద్దరూ పడవలో వెళ్తూ ఉన్నారు. కొడుకు మౌనంగా, దిగులుగా ఉండటం జాలరి గమనించాడు. ‘ఎందుకలా ఉన్నావ’ని ప్రశ్నించాడు. ‘డిగ్రీ వరకు చదివినా చిన్న ఉద్యోగం చేస్తున్నందుకు బాధగా ఉంద’ని చెప్పాడు. తన తోటి మిత్రులకు పెద్ద ఉద్యోగాలు దొరికాయని, దండిగా సంపాదిస్తున్నారని, ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాడు. వెంటనే జాలరి వలను కొడుకు చేతికి ఇచ్చి నదిలోకి విసరమన్నాడు. తండ్రి చెప్పినట్టే వలను నదిలోకి విసిరాడు. వలలో కొన్ని చేపలు పడ్డాయి. వెంటనే విసిరిన వలను పైకి లాగమన్నాడు జాలరి. అలాగే చేశాడు కొడుకు. వలను పైకి లాగాక, ‘నదిలో చేపలన్నీ వలలో పడ్డాయా?’ అని అడిగాడు జాలరి. ‘లేదు, కొన్నే పడ్డాయి.
అయినా నదిలో చేపలన్నీ మన వలకే ఎలా పడతాయి?’ అని ఎదురు ప్రశ్న వేశాడు కొడుకు. చిన్నగా నవ్విన జాలరి ‘నదిలో చేపలు చాలా ఉన్నా, మన వలలో కొన్నే పడతాయి. మనకు దొరికిన చేపలే మనకు ‘బంగారం’ అనుకోవాలి. వేరే జాలర్లకు దండిగా చేపలు దొరికాయని బాధపడుతూ కూర్చుంటే లాభమేమి? నదిలో చేపలన్నీ మనకు దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటే సుఖమేమి? జీవితంలో అవకాశాలు కూడా అంతే… అందరికీ అన్నీ రావు. వచ్చిన అవకాశాలను భక్తిగా స్వీకరించాలి. బాధ్యతగా వ్యవహరించాలి. మనసు పెట్టి చేయాలి. దొరికిన ఫలితంతో తృప్తిగా జీవితం గడపాలి. తృప్తికి మించిన సంపద లేదు. చిన్నదో, పెద్దదో దొరికిన ఉద్యోగాన్ని సక్రమంగా చెయ్యి. మనతోపాటు చేపల వేటకు బయలుదేరిన చాలామందికి మనకు దొరికినన్ని చేపలు కూడా దొరకలేదన్న విషయం గుర్తించు’ అని హితబోధ చేశాడు. ‘నిజమే… నేను చేసే ఉద్యోగం లాంటిది కూడా చాలామందికి దొరక్క బాధ పడుతున్నారు’ అనుకుంటూ చేపల్ని తీసుకుని సంతోషంగా ఇంటివైపు నడిచాడు కొడుకు.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు
93936 62821