మనోహి ద్వివిధం ప్రోక్తం, శుద్ధం చాశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితమ్ (అమృతబిందు ఉపనిషత్తు)
మనసు శుద్ధమని, అశుద్ధమని రెండు విధాలు. కామ సంకల్పం (కోరిక) కలిగిన మనసు అశుద్ధం. కామ వికారం లేని మనసు శుద్ధమైనది’ అని పై శ్లోక అర్థం. రామకృష్ణ పరమహంస చెప్పిన ఓ కథ ఈ ఉపనిషత్ వాక్యానికి భాష్యంగా కనిపిస్తుంది. ప్రియనాథ ముఖర్జీ అనే ఇంజినీరు సంసారంలో బందీ అయిపోయానని విచారిస్తూ ఉంటే పరమహంస ఈ కథ చెప్పారు. ‘ఇద్దరు మిత్రులు దారిలో వెళుతుండగా ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతున్నది. వారిలో ఒకడు ‘మిత్రమా! కాసేపు పురాణం విని పోదాం రా!’ అని లోపలికి వెళ్లి వినసాగాడు. రెండోవాడు మాత్రం లోపలికి ఓసారి తొంగిచూసి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక వ్యభిచార గృహం చేరుకున్నాడు.
ఐతే చాలాసేపు అక్కడ ఉండలేక పోయాడు. ఆ పరిసరాలు, వెకిలి చేష్టలు అతనికి రోత పుట్టించాయి. ‘ఛీ!ఛీ! నా స్నేహితుడు పవిత్రమైన హరినామాన్ని వింటూ సత్కాలక్షేపం చేస్తుంటే, నేనిలా తయారయ్యాను’ అని పశ్చాత్తాపం చెందాడు. పురాణం వినడానికి వెళ్లిన వాడు కాసేపటికే విసుగు చెందాడు. ‘నేనెంత తెలివిమాలిన వాణ్ని. వీడి వాగుడు వింటూ కూర్చున్నాను. నా మిత్రుడేమో స్వర్గ సుఖాలలో తేలిపోతూ ఉన్నాడు’ అని వాపోయాడు. కొన్నాళ్లకు వాళ్లిద్దరూ మరణించారు. యమభటులు భాగవతం విన్నవాడి జీవుణ్ని నరకానికి తీసుకుపోయారు. వ్యభిచార గృహానికి వెళ్లినవాడి జీవుణ్ని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయారు. పరమహంస ఈ కథ చెప్పి ‘అన్నిటికీ ప్రధానమైనది మనస్సే. బంధించేది అదే! విముక్తి కలిగించేది అదే! బందీ అయ్యేదీ, ముక్తి పొందేదీ మనసే! భగవంతుడు మానవుడిలో చూసేది మనసును మాత్రమే గాని, అతడు ఏమి చేశాడన్నది, ఎక్కడ ఉన్నాడన్నది పట్టించుకోడు’ అని వివరించారు.
మన ఏవ మనుష్యాణాం కారణం బన్ధ మోక్షయోః
బన్ధాయ విషయాసక్తం, ముక్త్యా నిర్విషయం స్మృతమ్ ‘మనుషుల బంధ మోక్షాలకు కారణం మనసే.విషయాలపై ఆసక్తి కలిగిన మనసు బంధం కలిగిస్తుంది. ఆసక్తి లేని మనసు మోక్షాన్ని ప్రసాదిస్తుంది’ అంటుంది మరో ఉపనిషత్ వాక్యం.
-డా॥ వెలుదండ సత్యనారాయణ