మా పాప వయసు ఆరు నెలలు. ఛాతిపైన ఉబ్బుగా, ఎర్రని మచ్చలా, కందిన గడ్డలా ఉంది. డాక్టర్‌కు చూపిస్తే దానిని హీమాంజీయోమా అంటారని చెప్పారు. తగ్గిపోతుందన్నారు. ఆడపిల్ల కదా? తగ్గకపోతే ఏం చేయాలి?
హీమాంజీయోమాలో చాలారకాలు ఉన్నాయి. శరీరంలో కొన్ని సందర్భాల్లో రక్తనాళాల గుచ్ఛం తయారయ్యేటప్పుడు క్రమం తప్పి ఎగుడు దిగుడుగా పెరిగితే దానిని హీమాంజీయోమా అంటారు. ఉబ్బుగా, ఎర్రగా ముఖం, మెడపై వస్తే అవి తేలికగానే తగ్గిపోతాయి.
గొంతు లోపల కూడా ఏర్పడతాయి. రక్తనాళాల్లోని ధమనుల్లో కూడా ఇలాంటివి ఏర్పడతాయి. కొన్ని వాటంతటవే తగ్గిపోతాయి. కొన్ని తగ్గవు. అవి పెరుగుతుంటే గమనిస్తూ ఉండాలి. కొన్ని ప్రధాన అవయవాల సమీపంలో ఉండి, ఇబ్బంది కలిగించే వాటికి చికిత్స అవసరం. కనురెప్పలపై ఏర్పడిన హీమాంజీయోమా కంటిచూపునకు అవరోధంగా ఉంటే వాటిని తొలగించాలి.
ఛాతి మీద ఉందని రాశారు. కానీ, అది బ్రెస్ట్ మీద ఎక్కడ ఉంది? బ్రెస్ట్ టిష్యూని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? అనేవి చెప్పలేదు. కొన్ని ముఖ్యమైన భాగాల్లో ఇబ్బంది కలిగిస్తుంటే వాటికి చికిత్స అవసరం. ఏ ఇబ్బందీ లేదనుకున్నప్పుడు కొంతకాలం వేచి చూడాలి. వీటిని మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. కొన్నిటికి లేజర్ చికిత్స అవసరమవుతుంది. శరీరం లోపలి భాగాల్లో హీమాంజీయోమా ఏర్పడితే కాలేయం లాంటి అవయవాల్లో ఉన్నాయో? లేవో? పరీక్షించాలి. మీ పాపకు ఉన్న సమస్య గురించి మీరు చెప్పిన వివరాల ప్రకారం కొంతకాలం వేచి చూడాలి. అవసరమైతే సమయానికి చికిత్స చేయించండి.