వానకాలం ముసురు పడుతుంటే ముసుగుతన్ని పడుకోవాలని అనిపిస్తుంది. అలా అనిపించినంత మాత్రాన అన్నీ అయిపోవు. వానలోనూ బయటికి వెళ్లక తప్పదు. మహా అయితే మనకు తోడుగా ఒక గొడుగు వస్తుందంతే! మిరపకాయ బజ్జీ తినడానికైనా, పచ్చి మిరపకాయలాంటి బాసుండే ఆఫీసుకు వెళ్లడానికైనా అదొక్కటే తోడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక్క వాన నుంచే కాదు, గాలి నుంచీ కాపాడేలా ఓ గొడుగు ఉంటే మనసుకూ, మనకూ ఊరట. ఆ ఆలోచనతోనే ‘హెల్మెట్ అంబ్రెల్లా’గా పిలిచే కొత్త రకం గొడుగుల్ని తయారు చేశారు. బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎంత సేఫ్గా అనిపిస్తుందో, వాన పడుతున్నప్పుడు ఈ హెల్మెట్ అంబ్రెల్లా వేసుకుంటే కూడా అంతే భద్రంగా ఫీలవుతాం. గొడుగులా వెడల్పుగా కాకుండా గిన్నె బోర్లించినట్టు గుండ్రంగా ఉండటం దీని ప్రత్యేకత. ఏట
వాలుగా పడే జల్లుల నుంచి, చల్లటి గాలి నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. చుట్టూ పరదా కప్పినట్టు ఉంటుంది కనుక, ఎండాకాలమూ పనికొస్తుంది. ఇంకేం, ఆన్లైన్లో ఆర్డర్ చేసేయండి, హెల్మెట్ అంబ్రెల్లా తెరిచేయండి!