ఏ కన్నవారైనా ఏం కోరుకుంటారు? అత్తింట కూతురి సంతోషాన్ని ఆశిస్తారు. వియ్యంకులు ఐశ్వర్యవంతులైనా కాకపోయినా.. ఆ ఇంట అన్నానికి కొదువ ఉండ కూడదనీ, తమ కూతురు నెత్తిన బిందె పెట్టుకుని మైళ్లకు మైళ్లు వెళ్లాల్సిన దుస్థితి రాకూడదనీ అనుకుంటారు. పుట్టబోయే పిల్లలు మంచి బడికి వెళ్లాలనీ, బాగా చదువు అబ్బాలనీ వేయి దేవుళ్లకు మొక్కుకుంటారు. వ్యవసాయ పెట్టుబడి కోసం అల్లుడు అప్పులవాళ్లచుట్టూ తిరగాల్సిన దుస్థితి రాకుంటే చాలనుకుంటారు. కేసీఆర్ సంక్షేమ పథకాల పుణ్యమాని.. తెలంగాణలోని గడపగడపకూ ఈ వరాలన్నీ అందుతున్నాయి. కాబట్టే, పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రజలు తమ కూతుళ్లను తెలంగాణ వరులకిచ్చి పెండ్లి చేయాలని తహతహలాడుతున్నారు.
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలవారి జీవితాలనూ మారుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బతుకుదెరువు కోసం వలసబాట పట్టేవారు. అర్ధాకలితో మాడేవారు. ఇప్పుడు ఆ దుస్థితి పోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగు
పడింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు, రైతుబంధు రూపంలో సేద్యానికి ఆర్థిక సాయం, రూపాయికే కిలో బియ్యం, ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి, దళితబంధు.. ఒక్కో ఇంటికి సగటున మూడు నుంచి ఆరు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. తెలంగాణలాంటి సంపూర్ణ సంక్షేమ రాష్ర్టానికి పిల్లనిస్తే.. ఇక, బిడ్డ బాగోగుల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. కాబట్టే మహారాష్ట్ర,
యావత్మల్ జిల్లా, కేళాపూర్ తాలూకాలోని పిప్పల్కోటీ గ్రామస్తులు తమ కూతుళ్లకు ‘తెలంగాణ వరులు మాత్రమే కావలెను’ అని షరతు పెడుతున్నారు. కులపెద్దలకూ, పెండ్లిళ్ల పేరయ్యలకూ ఒకే మాట చెబుతున్నారు. చదువు ఒక మోస్తరుగా ఉన్నా, అందగాడు కాకపోయినా, ఆస్తిపాస్తులు తక్కువైనా ఫర్వాలేదు. తెలంగాణ పిల్లగాడైతే చాలంటున్నారు.
‘తిప్పల్’ కోటీ..
పిప్పల్కోటీ ప్రజలు తెలివైనవారు. జీవితమంటే తెలిసినవారు. మహారాష్ట్రలో భాగంగా ఉన్న తమ పల్లె ఎలా ఉన్నదీ, పొరుగునే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాల ప్రగతి ఎలా ఉన్నదీ.. బేరీజు వేసుకోగల విజ్ఞత వాళ్ల సొంతం. పాపం.. పిప్పల్ కోటీ! కనీస సౌకర్యాలకూ నోచుకోవడం లేదు. రాళ్లు తేలిన రోడ్లు, వసతుల్లేని వైద్యశాలలు, మొండిగోడల బడులు.. అడుగడుగునా అవ్యవస్థే. తాగునీటి కోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. కూలీకి వెళ్తే కానీ పూటగడవని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో వృద్ధులు సైతం కాయకష్టం చేస్తున్నారు. తమ బతుకులు ఎటూ మారలేదు. కనీసం ఆడపిల్లలైనా.. శుభ్రమైన మంచినీళ్లు తాగుతూ, అద్దంలాంటి వీధుల్లో తిరుగుతూ.. పక్కా ఇండ్లలో పిల్లాపాపలతో హాయిగా బతుకుతారన్న ఆశతో వరుల వేటలో తెలంగాణ బాట పడుతున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ దాదాపు పాతిక మంది ఆడపిల్లలను ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల అబ్బాయిలకిచ్చి పెండ్లి చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రాకపోకలూ, బంధుత్వాలూ ఎక్కువే. నాందేడ్ జిల్లాలోని గ్రామాలవారూ వరుడి కోసం హద్దులకు ఆవల భూతద్దమేసి వెతుకున్నారు.

కొత్త తరాల కోసం..
‘ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లార దగ్గర మా ఊరు. మేం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా పరిధిలోకి వస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో బంధువులు చాలామందే ఉంటారు. తెలంగాణలో రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి అనేక పథకాలు ఉన్నాయి. పిల్లలకు మంచి బడులూ ఉన్నాయి. మా బతుకులే అధ్వానం, నా భర్త చనిపోయి తొమ్మిదేండ్లు అయినా నయాపైసా సాయం లేదు. మా సర్కారు చేతినిండా పింఛను కూడా ఇవ్వదు. కూలీపని చేస్తే కానీ పూట గడవదు. మేమూ తెలంగాణలో భాగమై ఉంటే.. ఇంతకష్టం వచ్చేది కాదు. నా బిడ్డ శ్వేత ఇబ్బందులు పడొద్దనే ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వీకి చెందిన వరుడికిచ్చి పెండ్లి చేశాను. ఆలూమగలు సంతోషంగా ఉన్నారు’ అని చెబుతారు పూండ్ర రుక్మాబాయి.
తెలంగాణ ప్రజల మనసు వెన్న. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలనూ, భరించిన వేదనలనూ ఇంకా మరిచిపోలేదు. కాబట్టే, పొరుగు రాష్ట్రంలోని పేదింటి ‘మహా’లక్షులను కోడళ్లుగా
చేసుకుంటున్నారు. ఆమాటకొస్తే.. కర్ణాటక సరిహద్దులైన బీదర్, రాయచూర్ తదితర కన్నడ ప్రాంతాల నుంచీ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన కర్నూలు, పల్నాడు నుంచి కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు ఆశగా మ్యారేజ్ బ్యూరోలకు ఫోన్లు చేస్తున్నారు.. ‘తెలంగాణ వరులు కావలెను’ అంటూ.
కల్యాణమస్తు!
-భాకే రఘునాథ్ రావు