‘చేతిరాత బాగుంటే.. మంచి మార్కులు వస్తాయి..’ విద్యార్థులకు టీచర్లు తరచూ ఇదే మాట చెప్తుంటారు. పిల్లలు బలపం పట్టింది మొదలు అందంగా అక్షరాలు దిద్దిస్తుంటారు. ముత్యాల్లాంటి అక్షరాలు రాసిన వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంటుంది. అలా తన అందమైన చేతి రాతతో నెట్టింట వైరల్ అయింది నేపాల్‌కు చెందిన పదహారేండ్ల ప్రకృతి మల్లా. చేతిరాత మన అకాడమిక్స్కు ఎంతో ఉపయోగపడుతుంది. అదే చక్కని, అందమైన చేతిరాత విద్యార్థులను కళల వైపూ మళ్లిస్తుంది.
అలా ప్రకృతి ఒక కాగితంపై రాసిన దస్తూరి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్’ టైటిల్‌ని ఆమెకు కట్టబెట్టింది. ప్రకృతి రాసిన ప్రాజెక్ట్ అసైన్మెంట్ పేపర్ అచ్చం ప్రింట్ చేసిన కాపీలా ఉండటంతో ‘వహ్వా’ అని నెటిజన్లు కీర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన యూఏఈ 51వ స్పిరిట్ ఆఫ్ ది యూనియన్ సందర్భంగా నేపాల్ అధికారులకు తన చేతిరాతతో ప్రకృతి అభినందన లేఖ పంపింది. అది కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో… ఎక్కడలేని ప్రశంసలు వచ్చిపడుతున్నాయి.