రుతుక్రమం అనేది మహిళల శరీరాల్లో ప్రతినెలా జరిగే సాధారణ ప్రక్రియ. మహిళల ఆరోగ్యం రుతుక్రమంపైనే ఆధారపడి ఉంటుంది. రుతుస్రావం సక్రమంగా జరగకపోతే ఆ ప్రభావం గర్భసంచిపై పడుతుంది. ఒత్తిడి, ఆహార నియమాలు కూడా రుతుచక్రంపై ప్రభావం చూపుతాయి. రుతుచక్రం సమస్యలను యోగాసనాలతో పరిష్కరించుకోవచ్చు. ఈ ఆసనాలు క్రమం తప్పకుండా వేస్తే నెలసరి సమస్యల నుంచి బయటపడవచ్చు.
మత్స్యాసనం: నేలపై వెల్లకిలా పడుకుని చేతులను తుంటి కింద ఉంచాలి. రెండు కాళ్లను మడవాలి. మోకాళ్లు, తొడలు నేలను తాకేలా ఉంచాలి. శరీర పైభాగాన్ని పైకి ఎత్తి, తల, వీపును కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచాలి. మెల్లగా ఊపిరి తీసుకుని కాసేపు అలాగే ఉంచి తర్వాత మెల్లగా వదలాలి.
మాలాసనం: పాదాలను వెడల్పుగా పెట్టి కూర్చొని మోకాళ్లను కూడా వెడల్పుగా ఉంచాలి. నమస్కారం పెట్టినట్టుగా అరచేతులను చేర్చి, మోచేతులను తొడలపై ఉంచాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి.
ధనురాసనం: పొట్టపై బరువు ఆనించి పడుకోవాలి. రెండు కాళ్లు, తలను వెనక్కి వంచాలి. చేతులను కూడా వెనక్కి పెట్టి రెండు పాదాలను పట్టుకోవాలి. మెల్లగా ఊపిరి తీసుకుని సాధ్యమైనంత సమయం ఉండాలి. ఈ ఆసనం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. వెన్నెముక, తొడలు, మోకాళ్లు బలంగా మారతాయి.
అధోముఖ శ్వానాసనం: రెండు పాదాలను దగ్గరగా పెట్టి నిలుచోవాలి. శ్వాస తీసుకుంటూ చేతులను పైకి ఎత్తాలి. శ్వాస నెమ్మదిగా వదులుతూ ముందుకు వంగాలి. చేతులను భుజాల కింద పెట్టి, ఊపిరి గట్టిగా పీల్చుకుని కాసేపు ఉండాలి.